
ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ కూర్పుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఆయన ఒక జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న మంత్రులలో కొందరిపై చంద్రబాబు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే 8 మంది మంత్రులను మారుస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒకేసారి ఇంతమందిని మారిస్తే వ్యతిరేకత వస్తుందన్న నేపథ్యంలో ఇద్దరు నుంచి ముగ్గురు మంత్రులను మార్చే ఛాన్సులు ఉన్నట్టు టాక్ ? ఇక కొందరు మంత్రులుగా ప్రమోట్ అయ్యే ఆశల్లో మునిగి తేలుతున్నారు. వీరిలో ప్రముఖంగా ఇద్దరు శ్రీనివాసులు తమకు ప్రమోషన్ ఖాయమని లెక్కలు వేసుకుంటున్నారు. విశాఖపట్నం జిల్లా భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేర్లు వినిపిస్తున్నాయి.
వీరు గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. వీరు పార్టీ విధానాలను ప్రజలకు చేరవేయడంతోపాటు, ప్రత్యర్థులపై కూడా వారిద్దరూ పదునైన అస్త్రాలతో విరుచుకుపడతారని మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం బాబు కేబినెట్‌లో ఉన్న మంత్రుల్లో కొందరు అనుకున్న విధంగా మైలేజీ సాధించలేకపోతున్నారు. ప్రభుత్వ పనితీరుకు ఇది ఇబ్బందిగా కూడా మారింది. ఈ పరిణామాలను అంచనా వేసిన సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని నిర్ణయించారు.
సాధ్యమైనంత త్వరగా మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. అయితే, ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకుంటారన్నది మాత్రం ఇప్పటి వరకు సీక్రెట్‌గానే ఉంచారు. ప్రస్తుతం కసరత్తు నడుస్తోందని.. చంద్రబాబు సింగపూర్ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే మార్పుల దిశగా చంద్రబాబు అడుగులు వేస్తారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఇద్దరు శ్రీనివాసుల పేర్లు పార్టీ వర్గాలలో జోరుగా చర్చకు వచ్చాయి. చాలా మంది నాయకులు మంత్రివర్గంలో చోటు కోసం ఎదురు చూస్తున్నా, అనుభవం ప్రాతిపదికనే నాయకులను ఎంపిక చేసుకోవాలని చంద్రబాబు నిర్ణయంతో ఉన్నట్టు సమాచారం.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు