ఇస్మార్ట్ శంకర్ సినిమాతో చాలా కాలానికి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ అనుకున్నట్లుగానే విజయ్ దేవరకొండతో సినిమా చేయడానికి రంగం సిద్దం చేసుకున్నాడు. ఈ సినిమాకు 'ఫైటర్' అనే టైటిల్ ను పూరి ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. టైటిల్ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వనప్పటికి...ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న పూరి జగన్నాధ్ ఈ ఏడాది చివరి వరకు సినిమాను పట్టాలెక్కించేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా పూర్తి అయిన తర్వాత పూరి సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం విజయ్ సరసన హీరోయిన్ గా ముందు నభా నటేష్ ను అనుకుంటున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్.. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తో పూరి చర్చలు జరుపుతున్నట్లుగా ప్రచారం జరిగింది. బాలీవుడ్ లో తనకున్న పరిచయాలతో బోణీ కపూర్ ను కూడా పూరి కలిశాడని.. కథ వినేందుకు బోణీ కపూర్, జాన్వీ కపూర్ లు ఒప్పుకున్నట్లుగా సినీ వర్గాల ద్వారా అందిన తాజా సమాచారం. 

త్వరలోనే జాన్వీ కపూర్ ను కలిసి స్క్రిప్ట్ ను వినిపించేందుకు దర్శకుడు పూరి రెడీ అవుతున్నట్లుగా ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం పూరి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసే పనిలో యమా బిజీగా ఉన్నాడు. కథ నచ్చితే విజయ్ దేవరకొండతో నటించేందుకు జాన్వీ కపూర్ ఒప్పుకుంటుందని పూరి టీం ధీమాగా ఉన్నారు. ఎందుకంటే తెలుగు హీరోల్లో తనకు విజయ్ దేవరకొండ అంటే ఇష్టం అంటూ ఒక టాక్ షో లో జాన్వీ కపూర్ చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే. విజయ్ దేవరకొండ సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అంటూ సినీ అభిమానులు చెప్పుకుంటున్నారు. మరి పూరి కి జాన్వీ ఓకే చెప్తుందో లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: