
ఇందులో నాగార్జున, గిరిజ ప్రధాన పాత్రలను పోషించారు. ఇళయరాజా సంగీతం అందించారు. `యంగ్ డే ఫస్ట్` అనే ఆంగ్ల చిత్రాన్ని చూసి ప్రేరణ పొందిన మణిరత్నం అదే తరహా కథ రాసుకుని గీతాంజలి చిత్రాన్ని తెరకెక్కించారు. గీతాంజలి టైటిల్ వెనుక కూడా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఢిల్లీకి చెందిన 11 ఏళ్ల బాలిక పేరు గీతాంజలి. త్వరలో తాను చనిపోతానని తెలిసి ఆ బాలిక డైరీలు రాసుకుంది. అవి పత్రికలో ప్రచురితం అవ్వగా.. వాటిని చూసి చలించిపోయిన మణిరత్నం కథకు ఆమె పేరే పెట్టారు.
భాగ్యలక్ష్మీ ఎంటర్ప్రైజెస్ బ్యానర్ పై 1988లో గీతాంజలి చిత్రం ప్రారంభమైంది. కేవలం 60 రోజుల్లోనే చిత్రీకరణ పూర్తయింది. 1989 లో విడుదలైన గీతాంజలి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. తెలుగులో ఒక క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. ప్రాణాలు ఎప్పుడూ పోతాయో తెలియని ఓ యువ జంట ప్రేమలో పడటం అనే భిన్నమైన స్టోరీతో మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే హీరో, హీరోయిన్ ఇద్దరూ చనిపోతారని తెలిసాక బయర్లు సినిమాను కొనేందుకు వెనకడుగు వేశారు. దాంతో నిర్మాత సీఎల్ నరసారెడ్డి స్వయంగా గీతాంజలి చిత్రాన్ని విడుదల చేశారు.
కట్ చేస్తే ఈ మూవీ హిట్ టాక్ తో 100 రోజులకు పైగా థియేటర్స్ లో ప్రదర్శింపబడింది. బెస్ట్ పాపులర్ ఫిల్మ్ క్యాటగిరీలో నేషనల్ అవార్డుతో పాటు ఆరు నంది అవార్డులను ఈ చిత్రం గెలుచుకుంది. అదేవిధంగా గీతాంజలి చిత్రం మొత్తం బడ్జెట్ రూ. 1.2 కోట్లు కాగా.. అందులో రూ. 7.5 లక్షలు రెమ్యునరేషన్ గా నాగార్జునకు ఇచ్చారు. అలాగే డైరెక్టర్ మణిరత్నం రూ. 10 లక్షలు పారితోషికం తీసుకున్నారు. ఇక గీతాంజలి మూవీతో ఎందరో అమ్మాయిల మనసు దోచుకున్న మన్మధుడిగా నాగార్జున గుర్తింపు పొందారు. ఆంధ్ర అందగాడిగానూ కీర్తించబడ్డారు.