నేడు మానవ జీవనం, పొద్దున్నే 6 కి లేవడం, హడావుడిగా ఉద్యోగానికి తయారవడం, ఇంత బాక్స్ లో పెట్టుకోవడం, పిల్లల్ని పాఠశాలలో దించి, తాను ఉద్యోగానికి హాజరవడం, అక్కడ పని చేయడం, పిల్లల్ని ఇంటికి తీసుకురావడం, ఇంత తిని, అర్ధరాత్రి వరకు మొబైల్ లో తలపెట్టడం, 12 దాటాక పడుకోవడం. మళ్ళీ రేపు షరా మాములే. ఎంత బిజీగా ఉన్నారో కదా. కాసేపు ప్రశాంతంగా ఉండటానికి లేదు. ఎప్పుడు చూడు ఏదో ఒకపని. అయితే ఇంట్లో కాకపోతే ఉద్యోగం చేసే చోట ఏదో ఒక పనితో చంపేస్తారు. ఇంటికి వచ్చాక కూడా పిల్లలకు హోమ్ వర్క్ ఇచ్చినట్టు ఆఫీస్ పని ఇస్తారు. అవన్నీ చేసుకొని పడుకోడానికే సమయం సరిగాలేక ఏ వీక్ ఎండ్ లోనో తనివితీరా మంచాన్ని కరుచుకొని పండుకుంటారు. సెలవు రోజులలో కూడా ఎంత బిజీగా ఉంటున్నారో కదా..!

ఈ బిజీ పీపుల్ ఏదైనా అవసరం వస్తే, అది తమకు మాత్రమే ఖచ్చితంగా సమయం ఖర్చుపెట్టి మరీ అది తీర్చేసుకుంటారు. అది నిజంగా పెద్ద అత్యవసరం అయినా సరే చిన్న సరదా అయినా సరే. ఇవన్నీ చేయడానికి సమయం కుదుర్చుకొని మరీ చేయడం వాళ్ళ గొప్పతనం. ఇన్ని చేసిన వారు ఉన్నదానిలోనే కాస్త సమయం దేశం గురించి ఆలోచించలేరా..! దేశానికేం బాగానే ఉందికదా.. అంటారా.. ఎప్పుడైనా దానిగురించి ఆలోచిస్తే అది ఎలా ఉందొ అర్ధం అవుతుంది. మనమేమో బిజీబిజీగా ఉంటాం. ఇంకా దేశం గురించి ఏమి ఆలోచించగలం. అటువంటప్పుడు నీదేశం ఎలా ఉందొ నీకు ఎలా తెలుస్తుంది. పర్లేదులే పాలించడానికి ఓటేసి గెలిపించిన నేతలు ఉన్నారు, బోర్డుర్ లో ప్రాణాలు ఇచ్చే సైన్యం ఉన్నారు, ఇంకా దేశం గురించి నాకు ఆలోచన ఎందుకు, అనవసరపు టెన్షన్ కాకపోతే అనేది చాలా మంది ఆలోచన.  

అది మానుకోవాలి. నీదేశం ఎలా ఉంది, నువ్వు ఎన్నుకున్న ప్రభుత్వం దేశానికి మేలు చేస్తుందా లేదా అనేది గమనిస్తూ ఉండాలి, ప్రపంచాన్ని కూడా అప్పుడప్పుడు గమనిస్తూ ఉండాలి, ఎవరైనా నీదేశానికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారా తెలుసుకుంటూ ఉండాలి. ఇవన్నీ చేస్తేనే నీదేశం గురించిన ప్రస్తుత వివరాలు నీకు తెలుస్తాయి. నీదేశం గురించి ఆలోచించమంటే దేశం మ్యాప్ ఏంటి, సౌత్ లో ఏముంది, నార్త్ లో ఏముంది, సరిహద్దులలో ఏయే దేశాలు ఉన్నాయి లాంటివి మాత్రమే కాదు, ప్రస్తుతం కూడా గమనిస్తూ ఉండాలి. అప్పుడే ఓటు వేసేప్పుడు సరైన నిర్ణయం తీసుకోగలవు, అప్పుడే సరైన నేతలు దేశానికి నాయకత్వం వహిస్తారు, అప్పుడే అభివృద్ధి సక్రమంగా జరుగుతుంది. ఇవన్నీ నువ్వు నీదేశం గురించి తెలుసుకోకపోవటం వలన జరుగుతున్న తప్పిదాలు, అంటే 75 ఏళ్ళు నీదేశం అభివృద్ధి చెందుతూనే ఉంది అంటే దానికి కారణం నువ్వే, నీవల్లే భారత్ ఎంతో ముందుకు పోవాల్సింది ఇంకా ఎటు తేల్చలేని స్థితిలో ఉండిపోయింది. కాసేపు దేశం గురించి ఆలోచించలేవు, కానీ భారతీయులం అని సిగ్గులేకుండా చెప్పుకుంటావు..! ఇప్పటికైనా నీదేశం పట్ల నీ బాధ్యత తెలుసుకో, అభివృద్ధి చేసుకో! నీ దేశం అభివృద్ధి ఇంకెవడో వచ్చి చేయడు, నువ్వే చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: