ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి తన రాజకీయ అనుభవాన్ని, సీనియార్టీని చాటుకున్నారు. గత కొద్ది రోజులుగా అసంతృప్తిగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బందిని దీపావళి పండుగ ముందు సంతోషపరిచే నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల డీఏ బకాయిలు, పీఆర్సీ అమలు వంటి అంశాలపై ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ విషయాలను పరిశీలించేందుకు సీఎం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి బాధ్యత నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్‌లకు అప్పగించారు.


శనివారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ చర్చలు సాయంత్రం వరకు కొనసాగాయి. ఉద్యోగ సంఘాలు డీఏ బకాయిలు రూ.7 వేల కోట్లు, పీఆర్సీ వంటి అంశాలపై పట్టుబట్టి ఉండటంతో చర్చలు క్లిష్టంగా మారాయి. రాత్రి 9 గంటల వరకూ చర్చలు సాగుతుండగా, ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమాచారం చేరింది. వెంటనే ఆయన పార్టీ కార్యాలయం నుంచి నేరుగా సచివాలయానికి చేరుకొని స్వయంగా ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ అయ్యారు. ఈ అనూహ్య భేటీతో ఉద్యోగ ప్రతినిధులు ఆశ్చర్యపోయారు. చంద్రబాబు మొదట రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు. ప్రభుత్వం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, రుణభారం వంటి అంశాలను స్పష్టంగా చెప్పారు. అయినా ఉద్యోగుల పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, ఒక డీఏ ఇవ్వడానికి అంగీకరించారు. ఈ డీఏ వల్ల సుమారు రూ.3 వేల కోట్లు ప్రభుత్వంపై భారంగా పడుతుందని చెప్పినా, అది ఉద్యోగుల ఖాతాల్లో వ‌చ్చే నెల నుంచే జమ అవుతుందని హామీ ఇచ్చారు.


అదే సమయంలో పీఆర్సీపై కూడా చర్చ జరిగింది. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడిన తర్వాత పీఆర్సీ అమలు చేస్తామని సీఎం తెలిపారు. సాధారణంగా ఈ ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలు అంగీకరించవు, కానీ సీఎం స్వయంగా చర్చించి వివరించడంతో వారు సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా ఆర్టీసీ కార్మికుల ప్రమోషన్లు, భత్యాలు, పోలీసుల ఈఎల్‌లు వంటి అంశాలపైనా సీఎం తేల్చిచెప్పారు. మొత్తం మీద దీపావళి ముందు ఉద్యోగుల మనసులు గెలుచుకున్న చంద్రబాబు నిర్ణయం రాజకీయంగా కూడా కీలకమైంది. ఆయన నైపుణ్యం, అనుభవం, సమయస్పూర్తి మరోసారి పనిచేసాయి. గడచిన ప్రభుత్వంతో పోలిస్తే, ఉద్యోగులతో నేరుగా మాట్లాడి సమస్యలు పరిష్కరించే నాయకుడిగా ఆయన మళ్లీ తన ముద్ర వేశారు. ఇది ఉద్యోగులకే కాదు, ప్రభుత్వానికి కూడా ఉత్సాహాన్ని ఇచ్చిన పరిణామంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: