ఉమ్మడి న‌ల్ల‌గొండ జిల్లాలో ఏకపక్షంగా 11 సీట్లు గెలుచుకున్న అధికార కాంగ్రెస్‌..ఆ ఒక్క నియోజకవర్గాన్ని మాత్రం దక్కించుకోలేకపోయింది. ఆ నియోజకవర్గంలో మొన్నటి దాకా హస్తం పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న నేత మృతి చెంద‌డంతో ఇప్పుడు కొత్త ఇన్‌చార్జ్‌గా ఎవ‌రు వ‌స్తారు ? అన్న‌ది ఉత్కంఠ‌గా మారింది. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండ‌డంతో స‌హ‌జంగానే ఇప్పుడు ఈ ఇన్‌చార్జ్ ప‌ద‌వి కోసం గ‌ట్టి పోటీ నెల‌కొంది. ఆ నియోజ‌క‌వ‌ర్గ‌మే సూర్యాపేట‌. సూర్యాపేట కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న దామోద‌ర్ రెడ్డి ఇటీవ‌ల దివంగ‌తుల‌య్యారు. దీంతో దామోదర్ రెడ్డి రాజకీయ వారసుడిగా ఏఐసీసీ సభ్యుడుగా ఉన్న సర్వోత్తమ్ రెడ్డికి నియోజకవర్గ ఇంచార్జ్‌ ఇవ్వాలని ఆయ‌న వ‌ర్గం కోరుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు పటేల్‌ రమేష్‌ రెడ్డి ఎప్పటినుంచో సూర్యాపేట నియోజకవర్గ ఇంచార్జ్ ప‌ద‌వి కోసం ఎప్ప‌టి నుంచో రెడీగా ఉన్నాడు. 2014 - 2018లో రెండుసార్లు ఆయ‌న దామోద‌ర్ రెడ్డి కోసం కాంగ్రెస్ సీటు త్యాగం చేశారు. రెండుసార్లు దామోద‌ర్ రెడ్డికి సీటు వ‌చ్చినా ఆయ‌న ఓడిపోయారు.


అయితే మొన్న సీటు త్యాగం చేసినందుకు గాను ఆయ‌న‌కు న‌ల్ల‌గొండ ఎంపీ టిక్కెట్ ఇస్తామ‌ని చెప్పి మాట త‌ప్పారు. చివ‌ర‌కు రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్‌గా పటేల్ రమేష్ రెడ్డికి నామినేటేడ్ పదవి కట్టబెట్టారు సీఎం రేవంత్‌. దామోదర్‌రెడ్డి కుమారుడు సర్వోత్తమ్‌రెడ్డితో పాటు దామోదర్‌రెడ్డి సన్నిహితుడు సూర్యాపేట మార్కెట్ కమిటీ ఛైర్మన్‌ కొప్పుల వేనారెడ్డి పేరు కూడా ఇంచార్జ్ రేసులో ఉంది. దామోద‌ర్ రెడ్డి ఉన్నంత సేపు ఇక్క‌డ సీటు కోసం ఆయ‌న‌తో పోటీ ప‌డ్డ ప‌టేల్ ర‌మేష్ రెడ్డి .. ఇప్పుడు కూడా గ‌ట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. వేం నరేందర్ రెడ్డి ద్వారా పటేల్‌ రమేష్ రెడ్డి సూర్యాపేట ఇంచార్జ్ పోస్ట్ కోసం రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నట్లు స‌మాచారం.


పటేల్ రమేష్‌రెడ్డి రెండుసార్లు పార్టీ నేతల విజ్ఞప్తితో పోటీ నుంచి విరమించుకున్నారు. అప్పుడే ఆయ‌న‌కు అధిష్టానం భ‌విష్య‌త్తులో మీకు సూర్యాపేట టిక్కెట్ ఇస్తామ‌ని హామీ ఇచ్చింద‌ట‌. ఈ సారి కూడా ఛాన్స్ రాక‌పోతే ఇక తాను కాంగ్రెస్‌లో ఉండి లాభం లేద‌ని కూడా ఆయ‌న స‌న్నిహితుల వ‌ద్ద అసంతృప్తి వ్య‌క్తం చేశార‌ట‌. అయితే జిల్లాకే చెందిన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మ‌ద్ద‌తు ర‌మేష్ రెడ్డికి లేదంటున్నారు. ర‌మేష్ రెడ్డికి కార్పొరేష‌న్ ప‌ద‌వి వ‌చ్చాక మ‌ర్యాద పూర్వ‌కంగా కలిసేందుకు వెళ్లినా ఉత్త‌మ్ పెద్ద‌గా ఆస‌క్తి చూప‌లేద‌ట‌. అయితే ఉత్త‌మ్ మాత్రం ర‌మేష్ రెడ్డి వైపు కాకుండా దామోదర్ రెడ్డి తనయుడు సర్వోత్తమ్ రెడ్డి లేకపోతే దామోదర్‌రెడ్డి సన్నిహితుడు వేనారెడ్డి వైపే  మొగ్గుచూపుతారని అంటున్నారు. ఇప్పటికే సర్వోత్తమ్ రెడ్డి పేరును ముందుకు తీసుకురావడం..గాంధీభవన్ దగ్గర ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. మ‌రి ఈ మూడు ముక్క‌లాట‌లో ఈ సారి అయినా ర‌మేష్ రెడ్డికి అవ‌కాశం వ‌స్తుందా ?  మ‌రోసారి ఆయ‌న త్యాగ‌రాజులా మిగిలి పోతారా ? అన్న‌ది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: