కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి ప్రజాదరణ, ఆయన పోరాట స్పూర్తి అన్నది అందరికీ తెలుసు. కానీ అదే కారణంగా హైకమాండ్ పదే పదే ఆయన నిర్ణయాలకు బ్రేకులు వేస్తోన్న పరిస్థితి. "మరో వైఎస్ అవుతారేమో" అన్న అనుమానంతో రేవంత్‌ను పూర్తిగా బలపడనివ్వడం లేదు. మంత్రివర్గంలో ఆయనను పట్టించుకోని వారు ఉన్నారు. వీరంతా హైకమాండ్ ఆశీస్సులతోనే వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాల అభిప్రాయం. ఈ పరిస్థితుల్లో రేవంత్ నాయకత్వం మరింత క్లిష్ట స్థితిలో పడింది.
ఇక జూబ్లిహిల్స్ ఉపఎన్నికలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. అభ్యర్థి నవీన్ యాదవ్ వ్యక్తిగత బలం ఉన్నప్పటికీ, నాయకుల మధ్య కలహాలు ప్రచారాన్ని ప్రభావితం చేస్తున్నాయి. కొందరు నేతలు పరస్పరం విభేదించుకోవడంతో పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటోంది. రేవంత్ స్వయంగా ప్రచారంలో పాల్గొంటారో లేదో స్పష్టత లేని పరిస్థితి. రాష్ట్ర స్థాయి నేతలు అక్కడకు వెళ్లిన ప్రతిసారీ వివాదాలు చెలరేగుతుండటంతో హైకమాండ్‌కు కూడా ఇబ్బందిగా మారింది. ఈ ఉపఎన్నిక ఫలితం రేవంత్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనుంది.
ఇక్కడ కాంగ్రెస్ నవీన్ యాదవ్ గెలిస్తే ప్రజల్లో ఆయన ఇమేజ్ మరింత బలపడుతుంది, కానీ హైకమాండ్ వద్ద ఆయన ప్రభావం పెరగకపోవచ్చు. ఓడితే మాత్రం పూర్తిగా పరాజయం బాధ్యత రేవంత్‌పై పడుతుంది. అందుకే రేవంత్ ఈ ఎన్నికను వ్యక్తిగతంగా సీరియస్‌గా తీసుకుని, వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం పరిస్థితులు ఆయనకు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ, లోపాయికారీ రాజకీయాలు ఏ దిశగా మలుపు తిప్పుతాయో చెప్పడం కష్టం. అందుకే సీఎం రేవంత్ ఇప్పుడు అత్యంత జాగ్రత్తగా ముందుకు సాగాల్సిన సమయం వచ్చింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి