అనగనగా ఒక ఊరిలో ఒక పిల్లి ఉండేది. అది ఆ ఊరంతా తిరుగుతూ పాలు, పెరుగు ,మాంసం, చేపలు ఇలా ఎవరింట్లో ఏది దొరికితే అది , ఏ మూల దాచుకున్నా పసిగట్టి మరీ తినేసేది. దాంతో ఊరంతా ఈ పిల్లి ఆగడాల గురించి మాట్లాడుకోవటం మొదలు పెట్టారు. అందరూ కలిసి దానికి దొంగ పిల్లి అని బిరుదు తగిలించి తిట్టుకునే వారు. ఆ పిల్లిని ఏదో ఒక విధంగా వదిలించుకోవాలని ప్రయత్నించేవారు. కానీ అది అంత సులువుగా ఎవరికీ దొరికేది కాదు. కళ్ళు మూసి తెరిచేలోపు అందరి కళ్ళు కప్పి పారిపోయేది.

దాంతో ఊరి పెద్దలు అందరూ ఆ ఊళ్లో పిల్లలకి పిల్లి ఆట కట్టించే బాధ్యత అప్పగించారు. కొంతకాలానికి పిల్లి అందరి ఇళ్ళల్లో దొంగతనం చేయడం మానేసింది. పిల్లలు ఏ పని చేస్తే ఆ పని చేయడం మొదలు పెట్టింది. ఊరిలోని పెద్దలు అందరూ ఆశ్చర్యపోయారు. పిల్లి లో ఇంత మార్పు ఎలా వచ్చిందో అర్థం కాలేదు. ఒకరోజు ఊరి పెద్ద లందరూ ఊరి మధ్యలో చెట్టు కింద కూర్చుని పిల్లల్ని పిలిపించారు. ఆ పిల్లిని మీరు ఏం చేసి మార్చారు. అని అడిగారు. అప్పుడు పిల్లలు. ఈ పిల్లి చేసే పనులు కొన్ని రోజులు జాగ్రత్తగా గమనించాం. పిల్లికి  బాగా ఆకలేసినప్పుడల్లా అది తినే పదార్థాలు ఉన్న ఇళ్లలోకి దూరుతోంది. ఎక్కడ దాచినా తినేస్తోంది అని మాకు అర్థం అయింది.

అప్పటి నుంచి మేము దానికి ప్రతి రోజు తినడానికి ఏదో ఒకటి పెట్టడం మొదలు పెట్టాం. అలా కొన్ని రోజులు పెట్టేసరికి అది ఎక్కడికీ వెళ్ళకుండా మేంపెట్టే తిండి కోసం ఎదురు చూడసాగింది. దాంతో పిల్లి ఎందుకు ఇలా చేస్తోందో మాకు అర్థమయింది. మేము దానికి క్రమం తప్పకుండా తిండి పెట్టాం. అది మాకు బాగా దగ్గరయ్యింది. మాతో స్నేహంగా ఉండసాగింది. మేము కనిపిస్తే దగ్గరకు వచ్చి తలను, కాళ్లకు రుద్దుతుంది. సంతోషంతో గంతులేస్తుంది. మేము కూర్చుని ఆడుకుంటే అది మాతో కలిసి పోతుంది. ఈ విధంగా పిల్లి మారింది. అని చెప్పారు. పిల్లి లో పిల్లలు తెచ్చిన మార్పు కు పెద్దలు సంతోషించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: