
- ఈ కంపెనీ నుంచే కూటమి పెద్దలకు రు. 350 కోట్ల లంచాలు
- ప్రభుత్వ భూముల్లో అభివృద్ధి పనులు చేపట్టాలి
- రైతులు భూముల అప్పనంగా ఇవ్వడానికి ఏపీ టీడీపీ, వైసీపీ అబ్బ సొత్తు కాదు
- నెల్లూరు జిల్లా కరివేడు సభలో బీసీవై జాతీయ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ధ్వజం
ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో పచ్చటి పంట పొలాలను కంపెనీలకు కట్టబెడుతూ రైతుల గొంతు కోస్తోందని బీసీవై జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ తీవ్రంగా విమర్శించారు. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలం కరివేడు గ్రామంలో ఇండో సోలార్ ప్రాజెక్టు పేరిట రైతులకు చెందిన 7300 ఎకరాల భూములను బలవంతంగా, దౌర్జన్యంగా రైతుల నుంచి తీసుకుంటోందని ఆయన ఆరోపించారు. శుక్రవారం ఈ గ్రామంలో పర్యటించిన ఆయన రైతులు, గ్రామస్తుల తరపున బీసీవై పార్టీ పోరాటం చేయడంతో పాటు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ మహేష్‌బాబు మహర్షి సినిమాలో ఓ దోపిడీ దొంగ అభివృద్ధి పేరుతో పచ్చటి పొలాలను ఎలా బలవంతంగా లాక్కుంటాడో నేడు కరివేడు గ్రామంలో రియల్‌గా అదే జరుగుతోందన్నారు. అభివృద్ధికి బీసీవై పార్టీ, ఇక్కడ రైతులు వ్యతిరేకం కాదని.. రైతుల కడుపు కొట్టి పచ్చటి పొలాలను ధ్వంసం చేయడం అభివృద్ధి కాదని.. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను ఇందుకు వాడుకోవాలని సూచించారు.
ఇదే ఇండో సోలార్ కంపెనీపై ప్రస్తుతం ప్రభుత్వంలో కీలకంగా ఉన్న తెలుగుదేశం నాయకులతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం గత ఐదేళ్లలో తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయాన్ని రామచంద్ర యాదవ్ గుర్తు చేశారు. ఏదైతే శిర్డీ సాయి ఎలక్ట్రికల్ కంపెనీ ఉందో ఆ కంపెనీ జగన్మోహన్ రెడ్డికి బినామీ కంపెనీ, వారి కుటుంబానికి చెందినదని నాడు ఆరోపించిన చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే ఆ కంపెనీ అవినీతి మొత్తం కక్కిస్తామన్న విషయాన్ని సైతం స్పష్టం చేశారు. టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సైతం పదే పదే ప్రెస్‌మీట్లలో ఈ కంపెనీ అవినీతి గురించి చెప్పలేదా ? అని ప్రశ్నించారు. ఇదే కంపెనీ నేడు టీడీపీకి గత యేడాది జనవరి 12న అధికారికంగా రు. 40 కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్లు సమర్పించగా.. మరో రు. 350 కోట్లు లంచం రూపంలో ఇవ్వడంతో ఆ కంపెనీ విషయంలో కూటమి ప్రభుత్వ పెద్దలు అందరూ గప్‌చుప్ అయిపోయారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
అందుకే ఆ కంపెనీకి ఏకంగా ఈ ప్రాంతంలో 7300 ఎకరాల భూములు అప్పనంగా కట్టబెడుతున్నారని ఆయన అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ప్రజల భూములు కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి ఈ రాష్ట్రం తెలుగుదేశం అబ్బ సొత్తో, వైఎస్సార్‌సీపీ అబ్బ సొత్తో కాదని ఘాటుగా విమర్శించారు. ప్రభుత్వం రైతులు భూములు వెనక్కు ఇచ్చేందుకు పది రోజులు గడవు ఇస్తున్నానని.. లేనిపక్షంలో రైతులు తరపున ఎబీసీవై పార్టీ పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉందని.. అవసరం అయితే ప్రాణాలకు తెగించడానికి తాము సిద్ధమని గ్రామస్తులకు రామచంద్ర యాదవ్ హామీ ఇచ్చారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు