మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్‌ చేస్తే రేంజ్‌ మారుతుందని చాలా మంది దర్శకులకి ఓ నమ్మకముంది. అందుకే రీఎంట్రీ ఇచ్చాక చిరు కోసం చాలామంది మేకర్స్‌ ప్రయత్నం చేశారు. అయితే కొద్ది రోజుల క్రితం వరకు మెగాస్టార్‌ సినిమాతో స్టార్డమ్‌ పెరుగుతుంది అనుకున్న దర్శకులు ఇప్పుడు ఒత్తిడిలో పడిపోయారు. మెగా అభిమానులను ఎలా సంతృప్తి పరచాలా అని ఆలోచిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌తో 'ఆచార్య' సినిమా చేస్తున్నప్పుడు కొరటాల శివ బంపర్ ఆఫర్ అందుకున్నాడని ఇండస్ట్రీ మొత్తం అనుకుంది. కొరటాల లక్కీ అనే మాటలు కూడా వినిపించాయి. కానీ 'ఆచార్య' విడుదలయ్యాక పరిస్థితి మొత్తం మారిపోయింది. చిరు, చరణ్‌ స్టార్డమ్‌ని సరిగా వాడుకోలేదని, కథలేని సినిమాతో మెగా ఆఫర్‌ని మిస్‌యూజ్‌ చేసుకున్నాడనే కామెంట్స్‌ వచ్చాయి.

మెహర్‌ రమేశ్‌కి 'షాడో' ఫ్లాప్ తర్వాత 8 ఏళ్లు సినిమాలకి దూరమయ్యాడు. ఇంత లాంగ్‌ గ్యాప్‌ తర్వాత చిరంజీవి సినిమాతో మెగా ఫోన్‌ పట్టాడు. తమిళ్ హిట్‌ 'వేదళం'ని 'భోళాశంకర్'గా రీమేక్‌ చేస్తున్నాడు. ఇక ఇంత గ్యాప్‌ తర్వాత చేస్తోన్న ఈ సినిమాతో కచ్చితంగా హిట్‌కొడితేనే మెహర్ రమేశ్‌ మళ్లీ బిజీ అయ్యే అవకాశం  ఉంది. దీనికి తోడు చిరంజీవి కూడా కంపల్సరీగా హిట్‌ కొట్టి అభిమానులను సంతృప్తి చేయాలనుకుంటున్నాడు. కంపల్సరీ సక్సెస్‌ అనే మాట మెహర్‌ రమేశ్‌పై ఒత్తిడి పెంచుతుందని చెప్పొచ్చు.

మోహన్‌ రాజా 'హనుమాన్ జంక్షన్' తర్వాత మళ్లీ తెలుగులో సినిమా తీయలేదు. మళ్లీ 21 ఏళ్ల తర్వాత చిరంజీవి 'గాడ్‌ఫాదర్'తో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. మళయాళీ హిట్‌ 'లూసిఫర్' రీమేక్‌గా తెరకెక్కుతోన్న 'గాడ్‌ఫాదర్' చాలామంది డైరెక్టర్స్ దగ్గరికెళ్లి ఫైనల్‌గా మోహన్‌రాజాని చేరింది. సో రీఎంట్రీతో హిట్‌ కొట్టాలనే ప్రెజర్‌తో పాటు, చిరంజీవి నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా ఉంది. మరి ఈ ప్రెజర్‌ని మెగాడైరెక్టర్స్‌ ఎలా డీల్ చేస్తారో చూడాలి. చిరు సినిమాలకు డైరెక్ట్ చేసే దర్శకులకు అంతా మంచి జరగాలనే కోరుకుందాం..



మరింత సమాచారం తెలుసుకోండి: