కాంగ్రెస్ లో అంతఃకలహాలు పెరిగిపోతున్నాయి.  కాంగ్రెస్ నేరుగా అధికారంలో ఉన్నది మూడు రాష్ట్రాల్లోనే. మరో రెండు రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. కాంగ్రెస్ బలంగా ఉన్న కేరళ అసోంలలో అసమ్మతి తారాస్థాయికి చేరుకుంది. అంతః కలహాలతో   కాంగ్రెస్ పని అయిపోయిందని చాలా మంది జోస్యం చెబుతూ ఉంటారు కానీ,అలా జరగడం లేదు. పార్టీలో అన్ని అభిప్రాయాల వారికి స్థానం ఉంటుంది. అందువల్ల అందరూ తలో రీతిలో మాట్లాడుతూ ఉంటారు. అంతరంగిక ప్రజాస్వామ్యం అని దీన్ని సమర్థించుకుంటూ ఉంటారు. ఇందిరాగాంధీ హయాం నుంచి కాంగ్రెస్ లో అంతర్గత కలహాలు ఉన్నాయి. ఆమె వైరి వర్గాలను కూర్చోబెట్టి సమస్యలను పరిష్కరించేవారు. ఆమె హయాంలో ఆమె మాటకు ఎవరూ ఎదురు చెప్పే వారు కారు. మహాత్మా గాంధీ హయాంలో కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ తిరుగుబాటు నాయకుడి గా పేరొందారు.

స్వాతంత్రం వచ్చిన తర్వాత పండిట్ నెహ్రూ హయాంలో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడే వారు ఉండేవారు. అయితే, అప్పట్లో అసమ్మతి వాదులు మృదువుగా పార్టీ ప్రయోజనాలే లక్ష్యంగా మాట్లాడేవారు. 1969లో ఇందిరాగాంధీ పార్టీలో తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. దాంతో పార్టీలో తొలిసారి చీలిక వచ్చింది. 1991 లో రాజీవ్ గాంధీ హత్య అనంతరం కాంగ్రెస్ లో శరత్ పవార్,మమతాబెనర్జీ, జగన్మోహన్ రెడ్డి,బిశ్వశర్మ వంటివారు పార్టీ నుంచి బయటకు వెళ్లి వేరే పార్టీలో చేరడమో, సొంతంగా పార్టీలు పెట్టుకోవడమో చేశారు. అయితే, కాంగ్రెస్ నాయకులు పరస్పరం కలహించుకున్న పార్టీలు వీడని వారూ ఉన్నారు. ఇరు వర్గాల మధ్య అధిష్టానం సయోధ్య కుదురుస్తుంది. సయోధ్య కుదిర్చే వ్యవస్థ కాంగ్రెస్ లో సంప్రదాయంగా కొనసాగుతోంది. ప్రస్తుతం పంజాబ్లో ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్,పిసిసి అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ ల మధ్య,ఛత్తీస్ఘడ్లో ముఖ్యమంత్రి భూపేష్ భాగేలా,ఆరోగ్య మంత్రి టియస్ సింగ్ దేవ్  మధ్య, రాజస్థాన్లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్,అసమ్మతి నేత సచిన్ పైలెట్ ల మధ్య కలహాలు శృతి మించుతున్నాయి. కేరళలో కాంగ్రెస్ అధికారంలో లేకపోయినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, సీనియర్ నాయకుడు రమేష్ చెన్నితల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కాంగ్రెస్ పార్టీ గడచిన ఏడేళ్లుగా అధికారంలో లేదు. మరో మూడేళ్లు కూడా ఖచ్చితంగా అధికారానికి దూరంగా ఉండొచ్చు.

2024 ఎన్నికల్లో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అధికారంలో లేకపోవడం వల్ల పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ,ఆమె కుమారుడు రాహుల్ గాంధీ బలహీనంగా కనిపిస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ అనేక రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. ఇప్పుడు వనరుల కోసం అధికారంలో ఉన్న కొద్ది రాష్ట్రాల పైనే పార్టీ అధిష్టానవర్గం ఆధారపడుతుంది. అధిష్టానం బలహీనంగా ఉందని గ్రహించిన రాష్ట్ర నాయకులు అధిష్టానాన్ని ఖాతరు చేయడం లేదు. అంతే కాకుండా గాంధీ కుటుంబం లో ఓట్లు తెచ్చే వారెవ్వరూ లేరని పార్టీ నాయకులు గ్రహించారు. దాంతో గాంధీ కుటుంబ సభ్యులకు గతంలో మాదిరిగా గౌరవం ఇవ్వడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: