
కొన్ని దేశాలను తమ చెప్పుచేతల్లో పెట్టుకుని ఆడించాలనే అమెరికా వ్యూహం ఇక్కడ పనిచేయదు. అవసరమైతే కొన్ని కష్టాలను ఎదుర్కోవడానికైనా మేం సిద్ధం. స్వాభిమానాన్ని చంపుకుని బతకడం కన్నా, ఆంక్షల నడుమ స్వతంత్రంగా నిలబడటానికే మొగ్గు చూపుతాం. రష్యా, ఇరాన్, చైనా, వియత్నాం, క్యూబా వంటి దేశాలు అమెరికా కన్నెర్రకు జడవకుండా తమ మార్గాన్ని తాము నిర్మించుకున్నాయి. ఆ తెగింపు, ఆ ధైర్యం ఇప్పుడు భారత్ నరనరాల్లో ప్రవహిస్తోంది. మమ్మల్ని ఓ పాకిస్తాన్ లాగానో, బంగ్లాదేశ్ లాగానో మార్చాలనుకుంటే అది పగటి కలే అవుతుంది.
అమెరికా ద్వంద్వ ప్రమాణాలు ప్రపంచానికి కొత్తేమీ కాదు. చైనాపై కఠినమైన ఆంక్షలు విధిస్తున్నామంటూనే, తమ దేశంలో కొరతగా ఉన్న బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్ కోసం అదే చైనా వైపు చూడటం వారి అవసరవాద రాజకీయానికి నిలువుటద్దం. వారికి అవసరమైన వస్తువుల విషయంలో ఎలాంటి నిబంధనలైనా పక్కకు పెడతారు. ఇదే సూత్రం రేపు మనకు కూడా వర్తిస్తుంది.
భారతదేశం ప్రపంచ ఫార్మసీగా పేరుగాంచింది. మన ఔషధాలు లేకపోతే అమెరికా ఆరోగ్య వ్యవస్థే ప్రమాదంలో పడుతుంది. ఇది కేవలం ఒక్క ఫార్మా రంగం మాత్రమే కాదు, అనేక ఇతర రంగాల్లోనూ అమెరికా మనపై ఆధారపడి ఉంది. వారి ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది కలిగించే, వారి దగ్గర ఉత్పత్తి లేని వస్తువుల కోసం వాళ్లే మన దగ్గరకు రాక తప్పదు. అందుకే, మనం భయపడాల్సిన అవసరం లేదు.
మన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ నుంచి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరకు, అందరి మాటల్లోనూ ఇదే నిర్భయ స్వరం వినిపిస్తోంది. వారి ప్రకటనల్లో కనిపించేది బెరుకు కాదు, 140 కోట్ల భారతీయుల ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం. అందుకే, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా, దేశ ప్రయోజనాలే లక్ష్యంగా వారు గట్టిగా నిలబడుతున్నారు. బెదిరిస్తే భయపడతామనే భ్రమల నుంచి అమెరికా ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. ఇది సరికొత్త శకం, ఇది ఆత్మనిర్భర్ భారత్ శకం.