ఇటీవల సినిమాల్లో “అడుక్కోవడం తప్పు కాదు, జీవించడమే ధైర్యం” అనే సందేశాలు వినిపిస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం మరో దిశగా అడుగేసింది. రాష్ట్రంలో అడుక్కోవడాన్ని పూర్తిగా నిషేధిస్తూ కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఇకపై రాష్ట్రంలో ఎవరు అడుక్కుంటూ దొరికినా వారికి కఠిన చర్యలు తప్పవు. మొదటిసారి పట్టుబడితే వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తారు. కానీ అక్కడి నుంచి వచ్చాక మళ్లీ అదే పని చేస్తే, వారికి జైలు శిక్ష తప్పదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో “బెగ్గింగ్” అనే సామాజిక సమస్యపై మరోసారి చర్చ మొదలైంది. ప్రభుత్వం దీన్ని కేవలం శిక్షాత్మక చర్యగా కాకుండా, సంస్కరణాత్మక చర్యగా చూస్తోంది.
 

అడుక్కునే వారిని శిక్షించడం కాదని, వారిని సంస్కరించడం, పునరావాసం కల్పించడం ముఖ్య లక్ష్యమని చెబుతోంది. పని చేయగలిగిన వారిని తగిన పనుల్లోకి దారి మళ్లిస్తారు. పని చేయలేని వారిని ప్రభుత్వం తినిపిస్తుంది. కానీ రోడ్లపై అడుక్కోవడాన్ని మాత్రం ఇక అస్సలు అనుమతించదు. ఇదంతా ఎందుకంటే “బెగ్గింగ్” అనే వ్యవస్థ వెనుక పెద్ద మాఫియా నెట్‌వర్క్‌ ఉందని ప్రభుత్వ పరిశీలన చెబుతోంది. వీధుల్లో అడుక్కునే వారిలో చాలా మంది నిజంగా అవసరం వల్ల కాదు, ముఠాలకు బానిసలై ఉన్నవారే. చిన్న పిల్లలు, అనాథలు, వృద్ధులను మాఫియా గుంపులు చేరదీసి వారిని రోడ్లపై అడుక్కునేలా చేస్తాయి. రోజంతా వచ్చేవన్నీ ఆ ముఠాలకే చేరుతాయి. ఈ బెగ్గింగ్ మాఫియాలను అరికట్టడమే ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు.

 

ఇక ఇప్పటికే భారతదేశంలోని 22 రాష్ట్రాలు అడుక్కోవడంపై నిషేధ ఉత్తర్వులు జారీ చేశాయి. ఆ జాబితాలో తాజాగా ఆంధ్రప్రదేశ్ కూడా చేరింది. గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత ఈ చట్టం ఇప్పుడు రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. అయితే సామాజికవేత్తలు మాత్రం ప్రభుత్వాన్ని ఒక కీలక అంశంపై హెచ్చరిస్తున్నారు. కేవలం చట్టాలు చేయడం, శిక్షలు విధించడం సరిపోదని; ముందుగా రీహాబిలిటేషన్ సౌకర్యాలు ఏర్పాటు చేయడం అత్యవసరమని అంటున్నారు. అడుక్కునే వారి వెనుక ఉన్న అసలు కారణాలను తెలుసుకుని, వారిని మానవతా దృష్టితో పునరావాసం చేయడం ద్వారానే సమస్యను శాశ్వతంగా పరిష్కరించవచ్చని వారు సూచిస్తున్నారు. మొత్తానికి, ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సామాజికంగా పెద్ద చర్చకు దారితీసింది. అడుక్కోవడం తప్పు కాదు, కానీ అడుక్కోబెట్టే వ్యవస్థనే మట్టుపెట్టాలి — ఇదే ప్రభుత్వ కొత్త మంత్రం!

మరింత సమాచారం తెలుసుకోండి: