ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థలు ఇప్పటివరకు డీజిల్ మాత్రమే డోర్ డెలివరీ ద్వారా అందిస్తున్నాయి. ఇకముందు పెట్రోల్ కూడా డోర్ డెలివరీ చేయాలని ప్రభుత్వ చమురు మార్కెటింగ్  సంస్థలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే డీజిల్ డోర్ డెలివరీ జరుగుతోంది. డీజిల్ డోర్ డెలివరీను మరో 20 నగరాలకు ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థలు విస్తరిస్తున్నట్లు సమాచారం. 
 
ప్రస్తుతం డీజిల్ డెలివరీని భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం అందిస్తున్నాయి. డీజిల్ డోర్ డెలివరీ చేయటం పట్ల ప్రజల నుండి మంచి స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది. భద్రతాపరమైన చర్యలు తీసుకొని ఈ సేవలు మరింత విస్తరించాలని భావిస్తున్నట్లు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ ఎం కె సురానా తెలిపారు. పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్ నుండి ప్రస్తుతం డీజిల్ డోర్ డెలివరీ చేయటానికి అనుమతి ఉంది. 
 
త్వరలో పెట్రోల్ డోర్ డెలివరీ చేయటానికి కూడా అనుమతులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం 35 నగరాల్లో డీజిల్ డెలివరీ సేవలు అందుతున్నాయి. ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థలు 500 డోర్ డెలివరీ వాహనాల్ని కొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎక్కువ పరిమాణంలో కొనే వినియోగదారుల్ని దృష్టిలో ఉంచుకుని ఈ సేవలను మొదలుపెట్టారు. పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్ అనుమతి ఉంటే మాత్రమే ఒకేసారి 2000 లీటర్ల కంటే ఎక్కువ మొత్తంలో ఇంధనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. 
 
తాజాగా భారత్ పెట్రోలియంకు 10, ఇండియల్ ఆయిల్ కార్పొరేషన్ కు 4, హిందుస్థాన్ పెట్రోలియమ్ కార్పొరేషన్ కు 6 నగరాల్లో ఇంధనాన్ని డోర్ డెలివరీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముంబాయిలాంటి నగరాల్లో 1,50,000 లీటర్ల డీజిల్ ప్రస్తుతం డోర్ డెలివరీ అవుతున్నట్లు సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: