తెలంగాణాలో టీయారెస్ సర్కార్ తొలిసారి మంత్రివర్గాన్ని విస్తరించింది. కొడుకు, మేనల్లుడులకు మంత్రివర్గంలో కేసీయార్ చోటు కల్పించడం కొత్త విషయంగా చెప్పుకోవాలి. హరీష్ రావు, కేటీయార్ గత మంత్రివర్గంలో మంత్రులుగా సేవలు అందించారు. ఇక సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాధోడ్, పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్ కొత్త మంత్రులయ్యారు. 


వీరందరిచేత నూతన గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. బావా బావమరుదులైన కేటీయార్, హరీష్ రావు ఒకే కారులో రాజభవన్ కి  రావడం ఆకట్టుకుంది. అలాగే ఇద్దరూ కూడా కేసీయార్ పాదాలకు నమస్కారం చేయడం జరిగింది. ఇక ఈ ఇద్దరికీ కీలక మంత్రిత్వ శాఖలు దక్కనున్నాయని భోగట్టా.


గతంలో నీటిపారుదల శాఖను చూసిన హరీష్ రావుకు అదే శాఖ దక్కే అవకాశం ఉంది. అలాగే ఐటీ, మునిసిపల్ శాఖలు కేటీయార్ కి ఇస్తారని టాక్. ఇక కేసీయార్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆరేళ్ల తరువాత మహిళలకు మంత్రులుగా అవకాశం దక్కింది. ఒకరు కాదు, ఇద్దరు మహిళా మంత్రులు ఈసారి ప్రమాణం చేశారు.


సబితా  ఇంద్రారెడ్డికి  హోం శాఖ ఇస్తారని సమాచారం. ఆమె 2004 లో గెలిచిన తరువాత వైఎస్సార్ సర్కార్ లో హోం శాఖను చేపట్టారు. మళ్లీ ఇన్నాళ్లనకు ఆమెకు హోం శాఖ దక్కబోతోంది. మరో వైపు వైసీపీ సర్కార్ ఏపీలో కూడా తమ మేకతోటి సుచరితకు హోం శాఖ ఇచ్చి మహిళను గౌరవించింది. ఇపుడు దీన్ని కనుక పరిగణనలోకి తీసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో మహిళలే హోం మంత్రులుగా ఉంటారన్న మాట. ఓ విధంగా ఇది అరుదైన ఘటనగా చెప్పుకోవాలి కూడా. నిజానికి మహిళలకు పోలీస్ శాఖను ఇవ్వలన్నది వైఎస్సార్ ఆలోచన. ఆయన అలా వినూత్నంగా ఆలోచించబట్టి ఇపుడు మళ్ళీ అదే ఆచారం కొనసాగుతోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: