ఇదేం పాలన, ఇదేం విధానం. అవినీతిని సర్వాంతర్యామిని చేసేశారు. ఇంతటి దారుణమైన పాలనను ఎక్కడా చూడలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ కంటే దుర్మార్గంగా ఉంది ఈ పాలన. అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అంతటా దోపిడీలూ, భూ కబ్జాలే అంటూ ఓ రేంజిలో ఫైర్ అయ్యారా మాజీ మంత్రి.


నంబర్ వన్ :


దేశంలో ఎక్కడా లేని విధంగా అవినీతి చంద్రబాబు పాలనలో సాగుతోందని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు హాట్ కామెంట్స్ చేశారు. పాలన గాడి తప్పిపోయిందని, కబ్జాకోరులు ప్రజల మీద పడి భూ దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. భూమి కనిపిస్తే చాలు బకాసురులైపోతున్నారని, అంగుళం కూడా వదలకుండా మింగేస్తున్నారని సెటైర్లు వేశారు. ఈ పాలన చూసి జనం జడుసుకుంటున్నారని అన్నారు. అవినీతిలో నంబర్ వన్ ఏపీ అన్నారు.


కాపాడుతున్న బాబు :


విశాఖలో పెద్ద ఎత్తున చోటు చేసుకున్న భూ కబ్జాలపై సీబీఐ విచారణకు ఆదేశించమంటే సిట్ ని వేసి బాబు సర్కార్ చేతులు దులుపుకుందని దాడి ఆరోపించారు. పోనీ ఆ సిట్ నైనా సరిగా పని చేయిందారా అంటే అదీ లేదన్నారు. మూడు వేలకు పై చిలుకు ఫిర్యాదులు వస్తే కేవలం మూడు వందలను మాత్ర‌మే స్వీకరించి విచారణ అయిందనిపించారని ఫైర్ అయ్యారు. ఆ నివేదిక ఇచ్చి కూడా ఎనిమిది నెలలు అయిందని, ఇంతవరకూ బయటపెట్టకపోవడానికి కారణమేంటని దాడి ప్రశించారు. ఎవరిని కాపాడాలని సిట్ నివేదిక  దాస్తున్నారని కూడా అడిగేశారు,
అధికార పార్టీకి చెందిన మంత్రులు, నాయకులు భూ కుంభకోణాల్లో ఉన్నారని దాడి అన్నారు. అందువల్లే చంద్రబాబు సిట్ నివేదికను బయటపెట్టడం లేదని కడిగేశారు. తమ భూములకు  కూడా రక్షణ లేకపోతే ఇక ప్రజలను ఏం పాలిస్తారని బాబుకు కౌంటర్లేశారు.


ఎటు వైపు :


హఠాత్తుగా దాడి ఇలా చంద్రబాబుపై దాడి చేయడం వెనక మతలబు ఏమై ఉంటుందన్నది ఇపుడు చర్చనీయాంశమైంది. దాడి మొన్నటి వరకూ టీడీపీలోకి రావడానికి ట్రై చేశారని ప్రచారంలో ఉంది. మరి అది జరగలేదు. జనసేనని పవన్ పిలిచి రమ్మన్న ఇంతవరకూ చేరలేదు. వైసీపీ అధినేత జిల్లాలో పాదయాత్ర చేసినా ఆ వైపుగా తొంగి చూడలేదు. మరి ఉన్నట్టుంది ఇలా బాబు ని అటాక్ చేయడం వెనక కారణం ఏమై ఉంటుదన్నది అర్ధం కావడంలేదు. పవన్ పార్టీ వైపు దాడి అడుగులు వేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: