అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో దేశీయ మార్కెట్లు బుధవారం మంచి లాభాల‌తో  ట్రేడింగ్‌ను ముగించాయి. ఫైనాన్షియల్, బ్యాంకింగ్ షేర్ల జోరు కొన‌సాగింది. దీంతో  ఉదయం నుంచే సూచీలు లాభాల బాట‌లో కొన‌సాగాయి.   మిడ్ సెషన్ సమయంలో కొంత ఊగిసలాటకు లోనైనప్పటికీ చివర్లో మాత్రం లాభాల‌నే న‌మోదు చేయ‌డం గ‌మ‌నార్హం. సెన్సెక్స్‌ 290 పాయింట్లు  పెరిగి  34,247కు చేరుకోగా.... నిఫ్టీ మాత్రం 70 పాయింట్లు బలపడి 10,116 వద్ద ముగిసింది. వరుసగా రెండో రోజు అమెరికా టెక్‌ ఇండెక్స్‌ నాస్‌డాక్‌ రికార్డ్‌ గరిష్టంవద్ద నిలవడంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు.

 

దీంతో 34,000 పాయింట్లకు పైగా  ఎగువన ప్రారంభమైన సెన్సెక్స్‌ తదుపరి 34,350 వరకూ ఎగసింది. ఆపై కొంతమేర ఒడిదొడుకులు చవిచూసి 33,950 పాయింట్ల క‌న్నా త‌క్కువ‌కు చేరుకుంది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 10,149 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకగా.. 10,037 దిగువన కనిష్టా ఫ‌లితాల‌ను న‌మోదు చేసింది. రంగాల వారీగా చూస్తే..మెటల్‌ , ఆటో షేర్లు నష్టాలను చూడగా..  ఇన్‌ఫ్రా, ఫార్మా, ఐటీ,  ఎనర్జీ రంగాల షేర్లు లాభాలను నమోదు చేశాయి. అలాగే   సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొన‌సాగాయి. హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, టాటా స్టీల్, ఓఎన్‌జీసీ, టైటాన్ కంపెనీల షేర్లు మాత్రం న‌ష్టాల‌ను మూట‌గ‌ట్టుకున్నాయి. 

 

ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన ప్రోత్సాహంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభపడ్డాయి. ప్రధానంగా బ్యాంకింగ్‌ కౌంటర్లకు డిమాండ్‌ పెరగడంతో రోజంతా దాదాపు సానుకూలంగానే కదిలాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా పీఎస్‌యూ, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 4-3 శాతం చొప్పున జంప్‌చేయగా.. రియల్టీ 2 శాతానికి  పైగా లాభపడింది. ఐటీ, ఫార్మా ప‌రిశ్ర‌మ‌ 0.5 శాతం స్థాయిలో పుంజుకోగా.. ఆటో, మెటల్‌ 1-0.5 శాతం చొప్పున నీరసించాయి. అంత‌కు ముందు ఉద‌యం మన మార్కెట్‌ ప్రారంభ సమయానికి అంతర్జాతీయంగా మిశ్రమ సెంటిమెంట్‌ నెలకొంది. ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమ పంథాను అనుసరిస్తున్నాయి. జపాన్‌, సింగపూర్‌, తైవాన్‌, కొరియా, థాయిలాండ్‌ దేశాల మార్కెట్లు లాభాల్లోనూ ట్రేడ్‌ అవుతున్నాయి. ఇండోనేషియా, చైనా, హాంగ్‌కాంగ్‌ దేశాలకు చెందిన సూచీలు నష్టాల్లో కదలాడాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: