తెలంగాణాలో ఏ ఎన్నికల్లో కూడా తమకు తిరుగేలేదనే భ్రమల్లో ఉన్న కేసీయార్, టీఆర్ఎస్ నేతలకు దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ చెమటలు పట్టించింది. ఊహించని రీతిలో బీజేపీ అభ్యర్ధి రఘనందనరావు 1160 ఓట్ల మెజారిటితో టీఆర్ఎస్ అభ్యర్ధి సుజాతపై గెలిచారు. దుబ్బాకలో టీఆర్ఎస్, బీజేపీల్లో ఎవరు గెలిచినా ఓడినా వచ్చేది లేదు పోయేది లేదు. బీజేపీ గెలిస్తే 119 సీట్లున్న అసెంబ్లీలో రెండో ఎంఎల్ఏ అవుతారంతే. ఇదే సమయంలో టీఆర్ఎస్ గెలిస్తే తన సీటును తానే నిలబెట్టుకున్నట్లవుతుంది. ఇంతకు తప్ప భూమి బద్దలయ్యేది లేదు, ఆకాశం విరిగి మీద పడేదీ లేదు. కాకపోతే కేసీయార్ ఇజ్జత్ కే సవాలుగా నిలిచిన దుబ్బాకలో పార్టీ ఓడిపోవటం కేసీయార్ కు డేంజర్ బెల్స్ మొగబోతున్న విషయం మాత్రం స్పష్టమైపోయింది. దుబ్బాకలో 2018 ఎన్నికల్లో సోలిపేట రామలింగారెడ్డి సుమారు 60 వేల ఓట్ల మెజారిటితో గెలిచారు. ఆయన హఠాత్తుగా మరణించటంతో ఉపఎన్నికలు అవసరమైంది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున సోలిపేట భార్య సుజాతనే పార్టీ తరపున పోటిలోకి దింపారు.
ఎప్పుడైతే సోలిపేట భార్యే పోటీకి దిగారో లక్ష ఓట్లకు తక్కువ మెజారిటి రాదంటు టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తుం చేశారు. ఇదే సమయంలో బీజేపీ తరపున మూడోసారి రఘునందనరావు పోటిలోకి దిగారు. ఈయన గడచిన రెండు ఎన్నికల్లో పోటి చేసి ఓడిపోయారు. అంటే ఇపుడు మూడోసారి పోటీచేసినట్లు. సరే టీఆర్ఎస్ అసంతృప్తి నేత శ్రీనివాసరెడ్డి చివరి నిముషంలో పార్టీ నుండి బయటకు వచ్చేసి కాంగ్రెస్ లో చేరారు. చివరి నిముషంలో పార్టీలో చేరినా కాంగ్రెస్ టికెట్ దక్కించుకుని పోటీలోకి దిగారు. చెప్పుకోవటానికి దుబ్బాకలో ట్రయాంగిల్ పోటి అయినా తొలినుండి టీఆర్ఎస్-బీజేపీ మధ్య పోటి అన్న విషయం అర్ధమైపోయింది. దానికి తగ్గట్లే తమకున్న బలానికి మించి కమలం నేతలు చాలా గట్టిగానే ప్రచారం చేసుకున్నారు. అవుట్ రైటుగా కేసీయార్ ను వ్యతిరేకిస్తున్న యావత్ బీజేపీ నేతలంతా చావో రేవో తేల్చుకోవాలన్నట్లుగా మొత్తం దుబ్బాకలోనే మోహరించారు.
మొదట్లో ఉపఎన్నికను టీఆర్ఎస్ చాలా లైటుగా తీసుకున్నదనే చెప్పాలి. సోలిపేట మరణం వల్ల వచ్చిన ఎన్నికలు కాబట్టి సానుభూతి ఓట్లతో పాటు తమ ఎలక్షనీరింగ్, కేసీయార్ ఛరిష్మా లాంటి అనేక కారణాల వల్ల తమ గెలపు నల్లేరు మీద బండినడకే అనుకున్నారు. అయితే బీజేపీ నేతల దూకుడు చూసిన తర్వాత టీఆర్ఎస్ లో కలవరం మొదలైంది. అందుకనే అర్జంటుగా ఉపఎన్నికల్లో గెలుపు బాధ్యతను హరీష్ రావుకు కేసీయార్ అప్పగించారు. మొదటి నుండి హరీషే బాధ్యతలు చూస్తున్నా ఎలక్షనీరింగ్ మొదలైన కొద్ది రోజుల వరకు సీరియస్ గా తీసుకోలేదు. దాంతో ఆ గ్యాప్ లోనే బీజేపీ నేతలు గట్టిగా పుంజుకున్నారు. దాంతో హరీష్ కూడా ఇదేదో దుబ్బాకలో తానే పోటీ చేస్తున్నాడనేట్లుగా కాలికి బలపం కట్టుకుని తిరగారు. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా హరీష్ నియోజకవర్గంలోనే క్యాంపు వేసి ఎన్నికల ప్రచారం చేయాల్సొచ్చింది. వ్యవహారం తేడాకొట్టేట్లుంది కాబట్టే కేసీయార్ కూడా బహిరంగసభల్లో ప్రసంగించాల్సొచ్చింది.
ముందే చెప్పుకున్నట్లు రిజల్టు వల్ల ప్రభుత్వంలో ఏమీ తేడా ఉండకపోయినా కేసీయార్ ప్రభుత్వానికి డేంజర్ బెల్స్ మోగినట్లుగానే భావించాలి. ఇపుడు దుబ్బాకలో బీజేపీ గెలుపు ప్రభావం రేపటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసి) ఎన్నికల్లో పడటం ఖాయం. ఎందుకంటే దుబ్బాక ఉపఎన్నికలో గెలిచిన బీజేపీ జీహెచ్ఎంసి ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తుందనటంలో సందేహం అవసరం లేదు. ఏదేమైనా దుబ్బాక ఉప ఎన్నిక లో మొదటి ఆరు రౌండ్లు టీఆర్ఎస్ వెనకబడటం ఏమిటి ? బేజీపీ 3050 ఓట్ల లీడుతో ఉందంటే మామూలు విషయం కాదు. మొత్తం 24 రైండ్ల ఓట్ల లెక్కింపును తీసుకున్నా ఏ రౌండులో కూడా టీఆర్ఎస్ పూర్తి కంఫర్టబుల్ గా లేదనే చెప్పాలి. చివరకు టీఆర్ఎస్ అంచనా వేసుకున్న లక్ష ఓట్ల మెజారిటి ఎక్కడా చివరకు 1160 ఓట్లతో బీజేపీ గెలవటం ఏమిటి ?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి