ఆంధ్రప్రదేశ్‌లో నవరత్నాల అమలుతో ఆర్ధిక వ్యవస్థ గాడి తప్పుతోంది. పేదలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాల్సిందేనని... అయితే ఆదాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. ఆదాయానికి, వ్యయానికి మధ్య పెరిగిన అంతరం ఇప్పుడు ఏపీలో ఆర్ధిక కష్టాలకు ప్రధాన కారణంగా నిలిచింది. నవరత్నాల కోసం వచ్చే ఆదాయాన్ని వ్యయం చేస్తుండటంతో అటు అభివృద్ది కార్యక్రమాలు, ఇటు కాంట్రాక్టర్ల బిల్లులు, ఉద్యోగుల జీతాలు, ఇతర చెల్లింపులు పూర్తిగా స్తంభించిపోయాయి. ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి ఎలా ఉందంటే రాష్ట్రంలో ప్రతి నెలా ఉద్యోగుల జీతాల కోసం రూ.4 వేల కోట్లు, పెన్షన్లు కోసం రూ. 1500 కోట్లు, సామాజిక భద్రతా పెన్షన్ల కోసం మరో రూ. 1500 కోట్లు, ఇవి కాకుండా తీసుకున్న రుణాలకు వడ్డీ చెల్లింపుల కింద రూ.4,500 కోట్లు... మొత్తం రూ.11,500 కోట్లు ఒకటో తేదీ నాటికి ఖజానాలో ఉండి తీరాల్సిందే. ప్రస్తుతం ఈ డబ్బులు కూడా లేకపోవడంతో ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు చెల్లింపు, కూడా ఆలస్యమవుతోంది.

విజయదశమి పర్వదినాలు, నవరాత్రి గడియలు వచ్చినా అక్టోబరులో రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలకు నిధులు బదిలీ కార్యక్రమాన్ని చేపట్టింది. 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు డ్వాక్రా మహిళలకు రూ.6,500 కోట్లు ఆసరా పథకం కింద నిధులు విడుదల చేయాల్సి ఉంది. ఇవి కాకుండా రైతు భరోసా, జగనన్న తోడు, జగనన్న చేదోడు పథకాలకు మరో రూ.4 వేల కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉంది. అంటే మొత్తంగా 11వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు అక్టోబరులో వ్యయం చేయనుంది. ఈ నిధుల కోసం ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు ఇవ్వడంలో జాప్యం జరుగుతోంది. రాష్ట్రంలో దాదాపుగా అక్టోబరులో అన్ని ఖర్చులు కలిపి రూ. 22 వేల కోట్లు అవసరమవుతాయి. కేంద్ర ప్రభుత్వం అదనంగా ఇచ్చిన రూ. 10,500 కోట్లు రుణ పరిమితిలో ఇప్పటికే రూ. 6 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వాడేసింది.

వచ్చే మంగళవారం రిజర్వ్ బ్యాంకు వద్ద మరో రూ. 2 వేల కోట్లకు సెక్యూరిటీ బాండ్లు వేలం వేసి నిధులు సమీకరించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ నిధులు వస్తే ఆసరా ఖర్చులకు పోను, మిగిలిన మొత్తాన్ని మిగిలిపోయిన ఉద్యోగులకు, పెన్షనర్లకు, వేతనాలు, జీతాలు జమ అయ్యే అవకాశం ఉంది. రోజు వారీ వచ్చే ఆదాయాన్ని కూడా ఆసరాకు మళ్లించడంతో ప్రభుత్వంలో ఆర్ధికంగా చిల్లిగవ్వకూడా దొరకని పరిస్థితి నెలకొంది. వీటితో పాటు కాంట్రాక్టర్ల బిల్లులు, అభివృద్ది కార్యక్రమాలకు నిధులు, ఇతర దైనందిన ప్రభుత్వ రోజు వారీ ఖర్చులకు కూడా నిధులు లేక ఆయా శాఖల అధికారులు అల్లాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: