ప్రస్తుతం హుజురాబాద్‌ ఉపఎన్నికలో కేసీఆర్‌ వర్సెస్‌ ఈటల అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఈ క్రమంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి.. హుజురాబాద్‌ ఉపఎన్నిక ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై సర్వే నిర్వహించి వెల్లడించిన విషయాలు చర్చనీయాంశం అయ్యాయి. అంతేకాకుండా ఆయన్ను అభినవ లగడపాటి రాజగోపాల్‌గా, తెలంగాణ లగడపాటిగా రాజకీయ వర్గాల వారు అభివర్ణించుకుంటున్నారు. ఎందుకంటే- ఏ ఎన్నిక జరిగినా లగడపాటి రాజగోపాల్‌ సర్వే నిర్వహించడం, వాటి ఫలితాలు ఎలా ఉంటాయోనని ముందే వెల్లడించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే 2019 సార్వత్రిక ఎన్నికలపై నిర్వహించిన సర్వే అంచనాలు తప్పడంతో..అప్పటి నుంచి లగడపాటి రాజగోపాల్‌ వాటికి దూరంగా ఉంటున్నారు. అలాగే  రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. విభజన జరిగితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న మాటకు కట్టుబడి లగడపాటి రాజగోపాల్‌ రాజకీయాలకు దూరమయ్యారు.

ఇదిలావుంటే, ఇప్పుడు తెలంగాణలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అచ్చు ఆంధ్రా పాలిటిక్స్‌లో లగడపాటి రాజగోపాల్‌ పోషించిన పాత్రను అనుసరిస్తున్నట్లుగా ఉందని చర్చ జరుగుతోంది.
నిజానికి కేసీఆర్‌ వ్యతిరేక శక్తులన్నీ హుజూరాబాద్‌లో ఒక్కటయ్యాయి. 2018 ఎన్నికలకు ముందే గులాబీ బాస్‌ కేసీఆర్‌తో కొండా విశ్వేశ్వరరెడ్డి విభేదించారు. టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి రెండవ సారి బరిలోకి దిగి అధికార టీఆర్ఎస్‌ పార్టీ అభ్యర్థి చేతిలో ఓటమి చెందారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ నుంచి కూడా బయటకు వచ్చేసిన ఆయన స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణకు ఏది మేలు, ఏది మంచి అయితే.. తాను అదే చేస్తానని చెబుతూ వస్తున్న కొండా విశ్వేశ్వరరెడ్డి.. హుజురాబాద్‌ ఉపఎన్నికలో మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు బహిరంగంగానే మద్దతు తెలిపారు. కేసీఆర్‌ అహంకారం అణగాలంటే.. హుజురాబాద్‌లో ఈటల విజయం సాధించాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఉద్యమకారులు అందరూ కోరుకుంటున్నట్లు కొండా విశ్వేశ్వరరెడ్డి అనడం గమనార్హం.

ఇదే సందర్భంలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అభినవ లగడపాటిలా వ్యవహరించారని కొందరు అభివర్ణిస్తున్నారు. తన సర్వే టీమ్‌తో పలుమార్లు నిర్వహించిన సర్వే ప్రకారం హుజురాబాద్‌లో ఈటల రాజేందర్‌ గెలుస్తారంటూ ఆయన వెల్లడించిన ఒక లెక్కను వారు ఉదహరిస్తున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి సర్వే ప్రకారం.. ఈటల రాజేందర్‌ కనీసం ౩౦ వేలు నుంచి 38 వేలు వరకు ఓట్ల తేడాతో ఈటల రాజేందర్‌ గెలుస్తారట. తాను ఒక నెలలో రెండు సార్లు, మళ్లీ నెలలో మూడు సార్లు సర్వే చేయించానని కొండా తెలిపారు. సామాజిక వర్గాల లెక్కల ప్రకారం కూడా చేసిన అన్ని సర్వేల్లో ఈటల రాజేందర్‌కు ఫేవర్‌గా నివేదికలు వచ్చాయని తెలిపారు. ఇలా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సర్వే వివరాలు వెల్లడించడంతో.. ప్రజల మూడ్‌ను ముందస్తుగా సిద్ధం చేసేందుకే ఆయనలా చెప్పారా? ఈ విషయంలో లగడపాటి రాజగోపాల్‌ పాత్రను కొండా విశ్వేశ్వరరెడ్డి పోషించారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: