ప్ర‌భుత్వంలోని అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌డం ప‌రిపాటి. కొన్ని సంద‌ర్భాల్లో ఆ అధికారులు ఉద్యోగం క‌న్నా రాజ‌కీయం ఎక్కువగా చేస్తుంటారు. అధికార పార్టీ నాయ‌కుల క‌నుస‌న్న‌న‌లో మెదులుతూ ఉంటారు. వాళ్లు త‌రువాతి క్ర‌మంలో అధికార పార్టీలో చేరి ప‌ద‌వులు చేప‌ట్టిన దఖలాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా సిద్ధిపేట క‌లెక్ట‌ర్ వెంక‌ట్రామి రెడ్డి త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరుతార‌నే ప్ర‌చారం జోరందుకుంది. ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో ఈ విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.


  వెంక‌ట్రామిరెడ్డి క‌లెక్ట‌ర్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజీనామా లేఖ‌ను తాత్కాళిక స‌చివాల‌యం బీఆర్‌కే భ‌వ‌నంలో ప్ర‌భుత్వం కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ కు అంద‌జేశారు. అయితే, క‌లెక్ట‌ర్ వెంక‌ట్రామిరెడ్డి రాజీనామాను ఇంకా ఆమోదించ‌లేదు. రాజీనామాను ఆమోదించే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. సిద్ధిపేట క‌లెక్ట‌ర్‌గా విధులు నిర్వ‌హించిన వెంక‌ట్రామిరెడ్డి ఇటీవ‌ల ప‌లు సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న టీఆర్ఎస్‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో ఆరోపించాయి.



అయితే, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో వెంక‌ట్రామిరెడ్డి రాజీనామా చేయ‌డంతో ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి కోసమే టీఆర్ఎస్‌లో చేరుతార‌నే మాట‌లు వినిపిస్తున్నాయి. అయితే, ప్ర‌తిసారి ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్పుడ‌ల్లా వెంక‌ట్రామి రెడ్డి పేరు తెర మీద‌కు వ‌స్తోంది. ఈసారి అన్ని ప‌క్క‌గా జ‌రిగితే ఎమ్మెల్సీ ప‌ద‌వుల జాబితాలో ఆయ‌న పేరు ఉంటుంద‌ని తెలుస్తోంది. వెంక‌ట్రామిరెడ్డి పెద్ద‌ప‌ల్లి జిల్లా ఓదెల మండ‌లం ఇందుర్తి గ్రామంలో జ‌న్మించారు.


ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక్క ప‌ద‌విని వెంక‌ట్రామిరెడ్డి కి ఇస్తాన‌ని కేసీఆర్ హామీ ఇవ్వ‌డంతోనే త‌న ఉద్యోగానికి రాజీనామా చేశార‌నే ప్ర‌చారం న‌డుస్తోంది. అయితే, వెంక‌ట్రామిరెడ్డితో పాటు చాలా మంది అధికారులు అధికార పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీగా ఉన్న‌ట్టు రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. మ‌రి రానున్న రోజుల్లో ఇంకెంత మంది ఉన్న‌తాధికారులు, అధికారులు గులాబీ కారు ఎక్కుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: