ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అసలు ఏ రోజు ఏం జరుగుతుందో కూడా తెలియటం లేదు. పాలిటిక్స్ హాట్ హాట్‌గా మారాయి. ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉన్నా కూడా... ప్రతిపక్షాలు ఇప్పటి నుంచి సమీకరణాలపై దృష్టి పెట్టాయి. ఇక అధికార పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టాయి కూడా. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ఒక రేంజ్‌లో ఫైర్ అయ్యారు. జగన్ ప్రభుత్వంపై బురద చల్లేందుకు చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తున్నారని ఆరోపించారు పేర్ని నాని. జగన్ సర్కార్‌పై పని కట్టుకుని మరీ దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. పార్టీ మూత పడుతుందనే భయం చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తోందని నాని ఆరోపించారు. అసలు టీడీపీ తీరు చూస్తుంటే... రాష్ట్రాభివృద్ధికి బ్రేక్ వేసేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు.

ఐదేళ్ల కాలం పరిపాలన చేసిన చంద్రబాబు... రాష్ట్రాన్ని ఏ విధంగా కూడా అభివృద్ది చేయలేదని మంత్రి పేర్ని నాని విమర్శలు చేశారు. కేవలం గ్రాఫిక్స్ భవనాలతో ఐదేళ్ల పాటు ప్రజలను భ్రమతో మాయ చేశారని ఆరోపించారు నాని. ఐదేళ్ పాటు భ్రమలోనే చంద్రబాబు కాలం గడిపారన్నారు. దుర్గ గుడి ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని చంద్రబాబు మధ్యలోనే వదిలేశారని ఆరోపించారు. జగన్ వచ్చిన తర్వాత పెండింగ్ బిల్లులు క్లియర్ చేసి పూర్తి చేసి ప్రారంభించారన్నారు. విజయవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు ఏ రోజు కూడా చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో చంద్రబాబుకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్ని నాని వెల్లడించారు. విజయవాడ ఔటర్ రింగ్ రోడ్డుకు 2016లోనే రిపోర్టు తయారు చేశారన్న మంత్రి పేర్ని నాని... చంద్రబాబు ప్రభుత్వం కనీసం డీపీఆర్ కూడా తయారు చేయలేక పోయిందని అసహనం వ్యక్తం చేశారు. గూగుల్ మ్యాప్ ద్వారా ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: