ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ. అత్యంత ఖరీదైన లీగ్ టోర్నీ. దాదాపు రెండు నెలల పాటు సాగే ఈ టోర్నీ కోసం భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు పెద్ద ఎత్తున పేమెంట్ కూడా ఇస్తుంది. ఈ టోర్నీలో ఒక్క పాకిస్తాన్ దేశ ఆటగాళ్లు మినహా... దాదాపు అన్ని దేశాల క్రికెటర్లు ఆడతారు. ఇప్పటికే 8 జట్లు ఆడుతున్న ఈ టోర్నీలో ఈ ఏడాది 10 జట్లు తలపడనున్నాయి. ఇలాంటి మెగా టోర్నీని స్పాన్సర్ చేసేందుకు బడా సంస్థలన్నీ క్యూ కడుతున్నాయి. ఈ ఏడాది నుంచి ఐపీఎల్‌కు కొత్త స్పాన్సర్ చిక్కారు. మన దేశానికే చెందిన‌ టాటా గ్రూప్ సంస్థ ఐపీఎల్ టైటిల్‌ స్పాన్స‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని ఐపీఎల్ చైర్మ‌న్ బ్రిజేష్ పటేల్ అధికారికంగా ప్ర‌క‌టించారు. 2022, 2023 ఐపీఎల్ టోర్నీల కోసం టాటా సంస్థ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తుందని కూడా బ్రిజేష్ పటేల్ వెల్లడించారు. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో చర్చించిన తర్వాత స్పాన్సర్ నిర్ణయం తీసుకున్నట్లు బ్రిజేష్ పటేల్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న టైటిల్ స్పాన్సర్ వివోతో ఒప్పందం రద్దు చేసుకున్నట్లు కూడా పటేల్ తెలిపారు.

వాస్తవానికి బీసీసీఐతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మరో రెండేళ్ల పాటు ఇంకా వివో సంస్థ ఐపీఎల్ టోర్నీకి స్పాన్సర్ గా వ్యవహరించాల్సి ఉంది. అయితే 2020 ఏడాది నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదం తలెత్తడంతో... చైనా సంస్థ అయితే వివోను ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‍‌గా తొలగించాలని  పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో 2020 ఏడాది ఐపీఎల్ టోర్నీకి వివోను టైటిల్ స్పాన్సర్‌గా తొలిగించిన బీసీసీఐ... డ్రీమ్ 11 సంస్థకు అవకాశం కల్పించింది. గతేడాది కూడా అలాగే చేసిన బీసీసీఐ. 2018 నుంచి 2022 ఏడాది వరకు ఐదేళ్ల కాలానికి టైటిల్ స్పాన్సర్‌గా బీసీసీఐతో వివో సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం 440 కోట్ల రూపాయలను ప్రతి ఏటా బీసీసీఐకు చెల్లించేందుకు కూడా అగ్రిమెంట్ చేసుకుంది వివో. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చైనా సంస్థ వివోనే ముందుగా ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. రెండేళ్ల పాటు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా టాటా గ్రూప్ సంస్థ వ్యవహరిస్తున్న ప్రకటించిన బ్రిజేష్ పటేల్.. ఆ ఒప్పందం విలువ మాత్రం ప్రకటించలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

ipl