తెలుగుదేశంపార్టీ పరిస్ధితి ఎంత అధ్వాన్నంగా ఉందో స్వయంగా చంద్రబాబునాయుడు మాటల్లోనే బయటపడింది. నియోజకవర్గాల నేతల విస్తృతస్ధాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాటలను చూస్తే పార్టీ పరిస్ధితి ఎంత డొల్లగా ఉందో అర్ధమైపోతుంది. ఇంతకీ చంద్రబాబు ఏమన్నారంటే మూడున్నరేళ్ళయినా చాలా నియోజకవర్గాల్లో నేతలు, ఇన్చార్జీలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటంలేదట. యుద్ధం చేసినంత సీరియస్ గా వచ్చే ఎన్నికలను ఎదుర్కొంటేనే టీడీపీ గెలుస్తుందన్నారు.





పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే సీరియస్ నెస్ తనలో ఉందికానీ నేతలు, ఇన్చార్జీల్లో కనబడటంలేదన్నారు. తాను రోడ్లమీద పోరాటాలు చేస్తుంటే నేతలు మాత్రం హ్యాపీగా ఇళ్ళల్లో పడుకున్నారంటు మండిపోయారు. ఏడాదిన్నరలో ఎన్నికలు వస్తుంటే సీనియర్ నేతలు, ఇన్చార్జీల్లో ఇంకా సీరియస్ నెస్ రాకపోతే ఎలాగంటు నిలదీశారు. నియోజకవర్గ ఇన్చార్జీలు, సీనియర్ నేతలు పదవులకు అలంకారప్రాయంగా తయారయ్యారన్నారు. పార్టీ నేతల్లో గ్రూపు రాజకీయాలు ఎక్కువైపోతున్నట్లు చెప్పారు.





పార్టీకోసం కష్టపడకుండా, టికెట్ రాగానే ఎన్నికల్లో గెలిచిపోవాలని అనుకుంటే ఏ విధంగా కూడా సాధ్యంకాదన్నారు. పార్టీ గెలిచిన తర్వాతే తాను అసెంబ్లీలోకి అడుగుపెడాతనని చేసిన శపథాన్ని నేతలంతా గుర్తుంచుకోవాలని బతిమలాడుకున్నారు. ఎంతో సమర్ధవంతంగా పోరాడితే తప్ప వచ్చే ఎన్నికల్లో గెలవటం కష్టమన్నారు. ప్రతి ఎన్నికలోను 60-70 వేల మెజారిటి వచ్చే కుప్పంలోనే గొడవలు జరుగుతున్న విషయాన్ని అందరు గుర్తుంచుకోవాలన్నారు. పట్టింపులు, ఇగోలు, నిర్లక్ష్యం లాంటివి వదిలేస్తేనే గెలుసామని లేకపోతే ఇంట్లోనే పడుకోక తప్పదని చంద్రబాబు స్పష్టంగా చెప్పేశారు.





విచిత్రం ఏమిటంటే కోటి సభ్యత్వాల నమోదును టార్గెట్ గా పెట్టుకున్నా చాలా నియోజకవర్గాల్లో నేతలు పట్టించుకోలేదని బాధపడిపోయారు. అంటే పార్టీ సభ్యత్వం జరగటంలేదు. నేతలు, ఇన్చార్జిలు పార్టీని పట్టించుకోవటంలేదు. చాలా నియోజకవర్గాల్లో గ్రూపుతగాదాలు పెరిగిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డిని సమర్ధవంతంగా ఎదుర్కోనేంత సీన్ ఇపుడు పార్టీకి లేదు లాంటి అనేక లోపాలు చంద్రబాబు మాటల్లోనే బయటపడ్డాయి. మరిన్ని లోపాలనున్న పార్టీ వచ్చే ఎన్నికల్లో 175 సీట్లలోను గెలుస్తుందని చంద్రబాబు చెబితే ఎవరైనా నమ్ముతారా ?

మరింత సమాచారం తెలుసుకోండి: