న్యూఢిల్లీ: భారత దేశంలోని పౌరులంతా నవంబర్ 26ను ఎన్నటికీ మర్చిపోరు.కొన్నేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున రెండు ముఖ్యఘట్టాలు దేశంలో చోటుచేసుకున్నాయి. అందులో ఒకటి.. దేశ ప్రజల కలలకు కొత్త వెలుగులను ప్రసాదించగా.. మరొకటి.. వందల మంది ప్రజల జీవితంలో కాళరాత్రి మిగిల్చింది. ప్రస్తుతం ఈ రెండు రోజులను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు లక్షల సంఖ్యలో పోస్టులు పెడుతున్నారు.


భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత రాజ్యంగ కమిటీ దేశ తొలి రాజ్యాంగాన్ని రూపొందించింది. ఈ రాజ్యాంగానికి సంబంధించిన డ్రాఫ్ట్‌ను 1949, నవంబరు 26న రాజ్యాంగ సభ ఆమోదించింది. ఇది కోట్లమంది ప్రజల ఆకాంక్షకు ప్రతిరూపం. అయితే మరో దుర్మార్గపు ఘటన కూడా ఇదే రోజున సంభవించింది. అదే 2008, నవంబరు 26న తాజ్ హోటల్‌లో జరిగిన తీవ్రవాదుల దాడి. ముంబైలోని తాజ్ హోటల్‌పై పాకిస్తాన్‌కు చెందిన తీవ్రవాదులు ఒక్కసారిగా దాడికి దిగారు. ఈ రెండు సంఘటనలను నెటిజెన్లు నేడు ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటున్నారు.


బ్రిటీషు పాలన చివరి దశల్లో ఉన్నకాలం అది. భారత దేశం స్వాతంత్ర్య వాయువులు పీల్చుకుంటున్న తొలి రోజులు. ఆ కాలంలోనే మేధావులంతా కలిసి భారత్‌కు ప్రత్యేక రాజ్యాంగం కావాలని చర్చలు ప్రారంభించారు. ఆ సమయంలోనే 389 మందితో రాజ్యాంగ సభ ఏర్పాటైంది. అయితే 1947లో దేశ విభజన తర్వాత ఈ సంఖ్య 299కి తగ్గిపోయింది. 1946 డిసెంబర్ 9న జరిగిన మొదటిసారి రాజ్యాంగ సభకు 211 మంది సభ్యులు హాజరయ్యారు. రాజ్యాంగ సభ అధ్యక్షుడిగా మొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్‌ నియమితులయ్యారు. అలాగే రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షుడిగా డాక్టర్ అంబేడ్కర్‌ని ఎన్నుకున్నారు. అంబేడ్కర్ అధ్యక్షతన పనిచేస్తున్న రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ తయారు చేసిన మొట్టమొదటి రాజ్యాంగ ప్రతికి 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదం తెలిసింది. అనంతరం 1950 జనవరి 26 నుంచి ఆ రాజ్యంగం మనదేశంలో అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలోనే నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటిస్తూ 2015లో ప్రధాని మోదీ ప్రత్యేక ప్రకటన చేశారు.


ఒకపక్క రాజ్యాంగం రూపొందిన దినోత్సవాన్ని ప్రజలంతా ఆనందంగా జరుపుకొంటుంటే.. 2008 నవంబరు 26న ముంబైలో మాత్రం దారుణ ఘటన జరిగింది. పాకీస్తాన్‌కు చెందిన 10మందికి పైగా టెర్రరిస్టులు ముంబైలోని తాజ్‌ హోటల్‌పై దాడులకు తెగబడ్డారు. బాంబులతో విరుచుకుపడ్డారు. ఈ దాడులు ఏకంగా 3 రోజుల పాటు సాగాయి. దేశ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన ఈ దారుణ మారణకాండ దేశ చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోయింది. అధికారిక లెక్కల ప్రకారం.. ఈ దాడిలో 173 మంది చనిపోగా 308 మంది వరకూ గాయపడ్డారు.


దక్షిణ ముంబైలోని 8 ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. ఛత్రపతి శివాజీ టర్మినల్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్‌మహల్ ప్యాలెస్, టవర్, లియోపాల్డ్కే ఫ్, కామా హాస్పటల్, యూదు మతస్తుల ప్రార్థనా స్థలమైన నారిమన్ హౌస్, మెట్రో సినిమా హాల్, టైమ్స్ ఆఫ్ ఇండియా భవనం వెనుక సందులో, సెయింట్జే వియర్స్ కాలేజీలపై తీవ్రవాదుల దాడి చేశారు. ముంబై పోర్టు ఏరియాలోని మాజగావ్‌లో, విలే పార్లేలో ఒక టాక్సీలో కూడా పేలుళ్ళు సంభవించాయి. ఈ దాడిలో మరణించిన పౌరులు, సైనికులకు గుర్తుచేసుకుంటున్న నెటిజన్లు వారికి తమవంతుగా నివాళులర్పిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: