నేటి సమాజంలో చిన్న చిన్న గొడవలే పెద్ద గొడవలకు దారి తీస్తున్నాయి. ఇక కారణాలు లేని గొడవలకు ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా పదిరూపాయల కోసం జరిగిన గొడవ గన్ తో బెదిరింపులకు దారి తీసింది. పోలీసుల ఎంట్రీతో విషయం సర్దుమణిగినా అసలు విషయం తెలిసి అందరూ షాకైయ్యారు. ఆంధ్రా ఊటి అరకులోయలో యువకులు గన్నుతో బెదిరింపులకు దిగిన ఘటన కలకలం రేపింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే..  అరకు టూర్ కు వెళ్లిన నలుగురు యువకులు అరకులోయ సెంటర్లో ఓ దుకాణం వద్ద ఆగారు. అక్కడ తమకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేశారు. ఐతే పది రూపాయల కోసం దుకాణం యజమానితో నలుగురు యువకులు వాగ్వాదానికి దిగారు. ఈక్రమంలో ఓ యువకుడు కారులో నుంచి దిగి షాప్ ఓనర్ నుదుట గన్ను ఎక్కుపెట్టి చంపేస్తానని బెదిరించాడు.

దీంతో బెదిరిపోయిన షాప్ యజమాని పెద్దగా కేకలు వేశాడు. స్థానికులంతా అక్కడికి చేరుకొని యులకుల్ని పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. షాప్ ఓనర్ ను బెదిరించిన గన్ చూసి అవాక్కవడం పోలీసుల వంతైంది. అది గన్ను కాదని.. సిగరెట్ వెలిగించుకునే లైటర్ అని పోలీసులు తేల్చారు. ఫ్యాషన్ కోసం గన్ లాంటి లైటర్ వాడుతున్న యువకుడు.., దానితోనే షాప్ ఓనర్ ను బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. యువకులు విశాఖ నుంచి అరకు టూర్ కు వచ్చినట్లు గుర్తించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జోగారావు తెలిపారు.

అయితే స్థానికులు మాత్రం అరకు అందాలు చూసేందుకు వస్తున్న పర్యాటకులతో తరచూ ఇలాంటి వివాదాలు తప్పడం లేదని వాపోతున్నారు. కొందరు యుకులు తాగి వచ్చి దాడులకు పాల్పడుతున్నారని.., తాజా ఘటన అరకు సెంటర్లో జరిగింది కాబట్టి అందరికీ తెలసిందని.., మారుమూల గ్రామాల్లో జరిగే ఘటనలు బయటకు రావడం లేదంటున్నారు. మరోవైపు మద్యం సీసాలు పొలాల్లో పడేస్తుండటం వల్ల గిరిజనులు గాయపడుతున్నట్లు చెప్తున్నారు. అరకు అందాలు ఆస్వాదించేందుకు వచ్చేవారు తమతో సవ్యంగా మెలగాలంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: