మొద‌టి నుంచి కొవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న కేరళ  మ‌రో అధ్యాయాన్ని లిఖించ‌నుంది. త్వ‌ర‌లో దేశంలోనే అతిపెద్ద కొవిడ్‌ కేర్ కేంద్రాన్ని ప్రారంభించ‌బోతోంది. కొచ్చిలోని అంబలాముగల్‌లో వెయ్యి ఆక్సిజన్‌ పడకలతో ఈ కేంద్రం ఏర్పాటైంది. కొవిడ్ నియంత్ర‌ణ‌లో భాగంగా ఆక్సిజ‌న్ కొర‌త తీర్చేందుకు రాష్ట్రంలో ఇప్ప‌టికే భారీ ఆక్సిజన్‌ ట్యాంకర్‌ను నిర్మించిన కేర‌ళ ఇప్పుడు ఆక్సిజ‌న్ బెడ్స్‌ అందుబాటులోకి తీసుకొస్తూ.. భారీ కరోనా ఆస్పత్రిని ఏర్పాటు చేసింది. చైనాలోని వుహాన్‌లో క‌రోనా వెలుగుచూసిన త‌ర్వాత మ‌న‌దేశంలో తొలికేసు కేర‌ళ‌లోనే న‌మోదైంది. అప్ప‌టినుంచే యుద్ధ‌ప్రాతిప‌దిక‌న ప‌నిచేసిన కేర‌ళ మొద‌టిద‌శ‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోగ‌లిగింది. అయితే రెస్టారెంట్లు, గ్రంథాల‌యాలు, సినిమా ధియేట‌ర్ల‌కు అనుమ‌తులివ్వ‌డంతో క‌రోనా తిరిగి విజృంభించింది. రెండోద‌శ‌లో దేశ‌వ్యాప్తంగా వైర‌స్ వ్యాపిస్తుండ‌టంతో నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌తో ఆద‌ర్శంగా నిల‌వాల‌ని ఆ రాష్ట్రం త‌ల‌పోసింది. అందులో భాగంగానే ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ ప‌లు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఈ చ‌ర్య‌లే ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో తిరిగి గెలుపొంద‌డానికి కార‌ణ‌మ‌య్యాయి.

అంబులాముగ‌లే ఎందుకంటే..
కొవిడ్‌ వేగంగా వ్యాప్తి చెందుతోందని.. పాజిటివిటీ రేటు తగ్గడంలేదని… అందుకే తాము నివారణ చర్యలను ముమ్మరం చేశామని పినరయ్‌ విజయన్‌ తెలిపారు. అంబులాముగల్‌ ప్రాంతంలో కొవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతుండడంతో అక్క‌డే ఆస్పత్రి ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌తోపాటు, ప్ర‌భుత్వ కార్యాల‌యాలు లాడ్జీలు, వ‌స‌తిగృహాల‌ను సైతం కొవిడ్‌ ఫస్ట్‌లైన్ చికిత్స‌ కేంద్రాలుగా మార్చ‌బోతున్నారు. కేర‌ళ నుంచి ఇత‌ర దేశాల‌కు ఉపాధి నిమిత్తం వ‌స‌ల‌వెళ్లేవారి సంఖ్య దేశంలోనే ఎక్కువ‌. ఏ రాష్ట్రంలోను లేన‌టువంటివిధంగా ఇక్క‌డ మూడు అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యాలున్నాయంటే వ‌ల‌స‌లు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవ‌చ్చు.

కొవిడ్‌పై యుద్ధంలో కీల‌క ఘ‌ట్టం
విమానాశ్ర‌యాల నుంచే అక్క‌డి ప్ర‌భుత్వం క‌రోనాపై యుద్ధాన్ని ప్రారంభించింది. ప్ర‌యాణికుల‌కు ప‌రీక్ష‌లు పూర్తిచేసిన త‌ర్వాత వారి వారి ఆరోగ్య ప‌రిస్థితుల‌నుబ‌ట్టి హోం ఐసోలేష‌న్ లేదంటే కొవిడ్ కేంద్రానికి త‌ర‌లించ‌డం ప్రారంభించింది. తాజాగా ఆక్సిజ‌న్ కొర‌త వేధిస్తుండ‌టంతో నేరుగా ఆక్సిజ‌న్ బెడ్ల‌తోనే ఆస్ప‌త్రి ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో ప‌నిచేయ‌డానికి అవ‌స‌ర‌మైన వైద్య‌సిబ్బందిని, పారామెడిక‌ల్ సిబ్బందిని కాంట్రాక్టు ప‌ద్ధ‌తిలో నియ‌మించ‌నున్నారు. ఇప్ప‌టికే అభ్య‌ర్థుల ఇంట‌ర్వ్యూలు పూర్తిచేసిన ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే వీరంద‌రికీ నియామ‌క‌ప‌త్రాలు అంద‌జేయ‌బోతోంది. కొవిడ్‌పై త‌మ రాష్ట్రం చేస్తున్న‌యుద్ధంలో ఇది కీల‌క‌మైన ఘ‌ట్ట‌మ‌ని ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ వ్యాఖ్యానించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: