ఏడేళ్ల తర్వాత అమెరికా మళ్లీ షట్‌డౌన్ (US government Shutdown) షాక్‌ని ఎదుర్కొంటోంది. కీలకమైన నిధుల బిల్లులకు ఆమోదం దొరకకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30 గంటలకు అధికారికంగా షట్‌డౌన్ ప్రక్రియ మొదలైనట్టు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అమెరికా అంతటా ప్రభుత్వ యంత్రాంగం ఒక్కసారిగా స్థంభించి పోయింది.సెనెట్‌లో రెండు ముఖ్యమైన ఫండింగ్ బిల్లులు ఆమోదం పొందకపోవడం ఈ సంక్షోభానికి ప్రధాన కారణం. డెమొక్రాట్లు స్టాపేజీ ఫండింగ్ బిల్లులను అడ్డుకోవడంతోనే షట్‌డౌన్ మొదలైంది. దీంతో అత్యవసర సేవలు మినహాయించి మిగతా అన్ని సేవలు నిలిచిపోయాయి. ఈ ప్రభావం లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులపై పడనుంది. మిలిటరీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, హెల్త్ ఎమెర్జెన్సీ వంటి ముఖ్యమైన విభాగాలు మాత్రం కొనసాగుతున్నాయి.

ప్రభుత్వం షట్‌డౌన్‌లోకి వెళ్లడం వల్ల లక్షలాది ఫెడరల్ ఉద్యోగులు సాలరీ లేకుండా ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తుంది. పని చేయకపోయినా పాత వేతనాలు మాత్రమే చెల్లించే పరిస్థితి ఉంటుంది. చెక్కులు జారీ చేయకపోవడం వల్ల ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. నేషనల్ పార్కులు, మ్యూజియంలు, పబ్లిక్ సర్వీసులు మూతబడ్డాయి. ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు – “ఈ షట్‌డౌన్ ఎక్కువ కాలం కొనసాగితే అమెరికా ఆర్థిక వృద్ధి దెబ్బతింటుంది. మార్కెట్లు కూడా ప్రతికూలంగా స్పందించవచ్చు” అని. చిన్నకాలం షట్‌డౌన్ ప్రభావం తక్కువగా కనిపించినా, దీర్ఘకాలం కొనసాగితే మాత్రం అమెరికా ఎకానమీకి మాంద్యం తప్పదని అంచనా వేస్తున్నారు.

2018లో కూడా అమెరికాలో షట్‌డౌన్ జరిగింది. ఆ సమయంలోనూ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగానే ఉన్నారు. ఇప్పుడు మళ్లీ ఆయన హయాంలోనే మరోసారి షట్‌డౌన్ జరగడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. “ట్రంప్ పాలనలో ప్రభుత్వ స్థిరత్వం తగ్గిపోతుందా?” అనే ప్రశ్నలు మళ్లీ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సెనెట్‌లో డెమొక్రాట్లు – రిపబ్లికన్ల మధ్య విభేదాలు కుదరకపోవడం వల్ల ఈ స్థితి ఏర్పడింది. అయినప్పటికీ ఈ షట్‌డౌన్ ఎక్కువ కాలం కొనసాగదని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ప్రతి రోజూ ఆలస్యం జరిగే కొద్దీ అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టం మిగులుతుందని కూడా హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: