
అంతేకాకుండా, డ్రైవర్ రాయుడిని అనైతిక కార్యక్రమాలకు వాడుకున్న సుధీర్ రెడ్డి, చివరికి అతడి హత్యకు కూడా పరోక్షంగా కారణమయ్యారని వారు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో, రాయుడు వీడియో వైరల్ కావడం, వినుత విడుదల కావడం, ఆమె వీడియో విడుదల చేయడం... ఇవన్నీ రాజకీయ కుట్రల కోణం వైపు వేలెత్తి చూపుతున్నాయి. వినుత తన వీడియో సందేశంలో, చెయ్యని తప్పునకు జైలుకు వెళ్లాల్సి రావడం తనను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాలో తమపై జరిగిన ప్రచారం బాధించిందని, అయితే కోర్టు తమ ప్రమేయం లేదని భావించడం వల్లే కేవలం 19 రోజుల్లో బెయిలు లభించిందని ఆమె స్పష్టం చేశారు. లక్షల జీతాలు వదులుకొని ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చామని, ప్రజల ప్రాణాలు తీయడానికి కాదని ఆమె తేల్చి చెప్పారు.
ఈ వ్యవహారంపై ఆమె ఒకే ఒక డిమాండ్‌ను జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముందు ఉంచారు. ప్రజలకు కొన్ని విషయాలు తెలియజేయడానికి, తనకు జరిగిన అన్యాయాన్ని వివరించడానికి ఆయన అపాయింట్‌మెంట్ ఇవ్వాలని వినుత కన్నీటితో కోరారు. పూర్తిస్థాయి బెయిలు రాగానే పవన్ కల్యాణ్‌ను కలిసి, శ్రీకాళహస్తి రాజకీయాల నుంచి తమను దూరం చేయాలని, తమ క్యారెక్టర్ దెబ్బ తీసే ప్రయత్నాలు జరిగాయని, ఈ కుట్రకు సంబంధించిన సాక్ష్యాధారాలతో సహా అన్ని విషయాలను మీడియా సమక్షంలో బయటపెడతానని కోట వినుత సవాలు విసిరారు. కోర్టు నుంచి క్లీన్ చిట్ వస్తుందనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారం శ్రీకాళహస్తి రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.