వైసీపీ గత ఎన్నికల్లో ప్రజల చేతిలో ఘోర ప‌రాభ‌వం ఎదుర్కొని యేడాది అవుతోంది. అంత కాలం గడిచినా పార్టీ కోలుకునే ప్రయత్నంలో పెద్దగా ముందుకు రాలేదు. నాయకత్వం నుంచే చురుకుదనం లోపించడంతో కిందస్థాయి నాయకుల్లోనూ ఉత్సాహం కనిపించట్లేదు. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లే విషయంలో పూర్తిగా వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. బెంగళూరులోనే ఎక్కువ కాలం గడిపేస్తూ, వారానికి రెండురోజులు మాత్రమే తాడేపల్లికి వచ్చి అధికారిక కార్యక్రమాలు ముగించేసి వెళ్లిపోతున్నారు. ఇదే పార్టీకి పెద్ద మైన‌స్‌గా మారింది. ఇక ఇన్‌చార్జ్ స్థాయి నాయకులు కూడా చాలా చోట్ల కనిపించకుండా ఉండిపోతున్నారు. మొత్తం రాష్ట్రంలో కనీసం 25 నియోజకవర్గాల్లోనైనా పార్టీ ఇంచార్జులు పూర్తిస్థాయిలో పని చేస్తున్నా అన్న ప్ర‌శ్న వేసుకుంటే... అది కూడా కొత్తగా నియమితులైన వారు మాత్రమే. వారికి బలం పెద్దగా లేకపోయినా, ఆర్థికంగా ఖర్చు పెట్టడానికి సిద్ధపడటంతో వారు మాత్రం కాస్త యాక్టివ్‌గా కనిపిస్తున్నారు.


అయితే పార్టీలో చాలా మంది కీల‌క నేత‌లు కాడి కింద ప‌డేసి కాలం గ‌డిపేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ వ్యక్తిగతంగా కొంతమందిని పిలిపించుకుని నియోజకవర్గాల్లో తిరగాలని, లేకపోతే కొత్త నాయకులకు బాధ్య‌త‌లు ఇస్తాన‌ని తెగేసి చెప్పార‌ని పార్టీ వ‌ర్గాల్లోనే ప్ర‌చారం జ‌రుగుతోంది. వీరికి వార్నింగ్‌లు ఇచ్చిన‌ట్టు కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ జాబితాలో కొడాలి నాని, వంశీ వంటి కీలక నేతల పేర్లు వినిపించడం పెద్ద చర్చకు దారితీసింది. ప్రత్యేకంగా వీరిని ఎందుకు హెచ్చరించారన్నది నేతల మధ్య ప్రశ్నగా మారింది. అయితే ప్రస్తుతం నాని, వంశీ ఇద్దరూ యాక్టివ్‌గా వ్యవహరించడానికి ఆసక్తి చూపడం లేదు. జగన్ సూచనలను పాటించి మళ్లీ వేదికలపై దూకుడు చూపితే, వెంటనే రాజకీయ ప్రత్యర్థులు టార్గెట్ చేసే అవకాశం ఉందని వారు భావిస్తున్నట్టు తెలుస్తోంది.


అసలు సమస్య జగన్ లోనే ఉందని పార్టీ అంతర్గతంగా అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రజల్లోకి ఆయన వెళ్లకపోవడం, జిల్లాల వారీగా కార్యకర్తలను పరామర్శిస్తానన్న హామీని వెనక్కి తీసుకోవడం, పాదయాత్ర తప్ప ప్రజా కార్యక్రమాలపై స్పష్టమైన కార్యాచరణ లేకపోవడం పార్టీలో నిరుత్సాహాన్ని పెంచింది. ఉన్నత నేతలు కూడా “మేము చేస్తాం” అని చెప్పే పరిస్థితి లేదు. స్టేజ్ షోలు, సాక్షి ప్రచారాలు, ఒకోసారి ర్యాలీలు… ఇవే ఇప్పుడు వైసీపీ చురుకుదనంగా మిగిలాయి. జగన్ వెళ్లే చోట్ల జనాలను బలవంతంగా తీసుకురావడం మాత్రమె జరుగుతోంది. కానీ నిజంగా ప్రజల్లో పని చేసే క్యాడర్ కనిపించడం లేదు. ఎన్నికలకు ఏడాది మాత్రమే ఉండగా ఈ పరిస్థితి మారకపోతే వైసీపీకి మరింత కష్టకాలం తప్పేదిలేదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: