శ్రీమతి సరోజిని నాయుడు గారి ప్రేరణతో స్త్రీల సామాజిక, ఆర్థిక, రాజకీయ ఉన్నతి కోసం పోరాడిన ధీర వ‌నిత డా.ముత్తుల‌క్ష్మి రెడ్డి.. భార‌త‌దేశంలో మొట్ట‌మొద‌టి మ‌హిళా చ‌ట్ట‌స‌భ స‌భ్యురాలుగా చ‌రిత్ర‌కెక్కారు ఆమె. మ‌హిళ‌ల సంక్షేమం కోసం పోరాడిన ఆమె సేవ‌ల‌ను గుర్తించి నాటి మాద్ర‌స్ రాష్ట్ర ప్ర‌భుత్వం ముత్తుల‌క్ష్మి రెడ్డిని శాస‌న మండ‌లి స‌భ్యురాలిగా 1927 వ సంవ‌త్సరంలో నియ‌మించింది. శాసన మండలి సభ్యురాలిగా దేవదాసీ విధాన రద్దు, కనీస వివాహ వయసు పెంపు, నిర్బంధ వ్యభిచారం రద్దు, బాలల హక్కుల రక్షణ తదితర విషయాలపై పోరాడారు.


 1931వ సంవత్సరం అఖిల భారత మహిళల సదస్సు (ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్) కు అధ్యక్షత వహించారు. ఈ సదస్సు తరపున మహిళల ఓటు హక్కుకై పోరాడారు. గాంధీ గారిచ్చిన ఉప్పు సత్యాగ్రహ పిలుపుతో శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. భారత ప్రభుత్వం 1919 చట్టం ప్రకారం మహిళలు ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కల్పించింది. ఈ చట్టం ప్రావిన్స్‌లోని శాసన మండళ్లకు ఎన్నికల్లో ఓటర్ల అర్హతను నిర్ణయించే అవకాశాన్ని ఇచ్చింది. 1921 లో, మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కొంతమంది మహిళలకు ఓటు వేసే అధికారాన్ని ఇచ్చే తీర్మానాన్ని ఆమోదించింది.



తరువాత, కొన్ని సంవత్సరాల తరువాత మరొక తీర్మానం మహిళలు చట్టసభ సభ్యులుగా మారడానికి మార్గం సుగమం చేసింది. 1926 లో, ప్రభుత్వం 40 ఏళ్ల డాక్టర్ ముత్తిల‌క్ష్మి రెడ్డిని శాసన మండలికి నామినేట్ చేసింది.  డాక్టర్ ముత్తిల‌క్ష్మి రెడ్డి  1886వ సంవత్సరం జూలై నెల 30 వ తేదీన పుదుక్కోటై సంస్ఠానంలో నారాయణ సామి, చంద్రమ్మాళ్ దంపతులకు జన్మించారు. సాధారణమైన నేపథ్యం నుండి వచ్చారు. చాలా క‌ష్టాల‌ను అధిగ‌మించి వైద్య విద్య‌లో డిగ్రీ పూర్తి చేశారు. మహిళాభ్యుదయం కోసం ` స్త్రీధర్మ ` అనే పత్రికను నడిపారు ముత్తి ల‌క్ష్మిరెడ్డి. ప్రస్తుతం భారతదేశంలోనే అగ్రగామిగా ఉన్న క్యాన్సర్ వైద్యశాలగా ఉన్న అడయార్ కాన్సర్ వైద్యశాలను ముత్తులక్ష్మి రెడ్డి గారు 1954వ సంవత్సరంలో స్థాపించారు. 1956వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ముత్తు ల‌క్ష్మారెడ్డి ని పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: