దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రాల్లో శబరిమల శ్రీఅయ్యప్ప ఆలయం ఒకటి. ధనుర్మాసం అనగానే సూర్యోదయంలోగా స్నానాలు.. పూజలు.. ఉపవాసాలు.. ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక కార్యక్రమాలే కనిపిస్తాయి. మాలధారణలు, సంప్రదాయాలు, ఆధ్యాత్మికత ఉట్టిపడతాయి. ఇలా భక్తులు కార్తీకమాసం నుండి దాదాపు మార్గశిర పుష్య మాసాల వరకు దృఢమైన నియమాలను ఆచరిస్తూ ఉంటారు. శరీరాన్ని, మనస్సును అదుపులో ఉంచుకొని సన్మార్గంలో పయనింపజేసేదే అయ్యప్ప మండల దీక్ష. 41 రోజుల పాటు అయ్యప్పకు ఆత్మనివేదన చేసుకుంటూ నిత్యశరణు ఘోషతో పూజిస్తారు.

 

ఉభయ సంధ్యల్లో చన్నీళ్లతో శిరస్నానం ఆచరించి స్వామికి దీపారాధన చేసి, స్తోత్రపఠం చేయాలి. దేవతార్చన జరిపి, మధ్యాహ్నం బిక్ష, రాత్రికి అల్పాహారం తీసుకోవాలి. నల్లని దుస్తులు ధరించాలి. రోజూ దేవాలయాన్ని దర్శించాలి. మద్యం, మాంసం తదితర దురలవాట్లకు దూరంగా ఉండాలి. పాదరక్షలు ధరించరాదు. నల్లని వస్త్రాలు, తులసిమాల, నుదుట విభూదిపై గంధం బొట్టు ధరించాలి. దినంలో అధిక భాగం పూజ భజనాది కార్యక్రమాలలో గడుపుతారు. 

 

ఉల్లి, వెల్లుల్లి లేకుండా సాత్విక భోజనం చేయాలి. కటికనేల మీద పడుకొంటారు.అందరినీ "స్వామి" అని సంబోధించాలి. దీక్షా కాలంలో 'స్వామియే శరణమయ్యప్ప' అనే మూల మంత్రాన్ని ఎల్లవేళలా జపించాలి. మాలధారణలో ఉన్నప్పుడు స్త్రీలను భార్యతోసహా దేవతామూర్తులుగా భావించాలి. ఇలా అయ్యప్ప స్వామి దీక్షకు ఒక స్పష్టమైన, కొంత క్లిష్టమైన విధానం రూపు దిద్దుకొంది. ఇక శబరిమలలో అయ్యప్పస్వామి దర్శనానంతరం దీక్షాపరులు ఇంటికి తిరిగి వచ్చాకే మాల విరమణ చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: