ఇక ఏక‌ధ్రువ ప్ర‌పంచానికి కాలం చెల్లిన‌ట్టే. మ‌ళ్లీ ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం నాటి రోజులు తిరిగి వ‌చ్చిన‌ట్టే. అమెరికాకు వ్య‌తిరేకంగా సూప‌ర్ ప‌వ‌ర్‌గా చైనా ఎదుగుతోంద‌ని అగ్ర‌రాజ్యం ఆధిప‌త్యానికి స‌వాల్ విసురుతోంద‌ని ప్ర‌పంచ‌మంతా భావిస్తుంటే ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఆ పోటీలోకి ఒక‌నాటి సూప‌ర్ ప‌వ‌ర్ ర‌ష్యా కూడా ఇప్పుడు అడుగు పెట్టింది. ఊహించ‌ని ఉత్పాతంలా ఉక్రెయిన్‌పై విరుచుకుప‌డుతూ నాటో దేశాల కూట‌మి ప్రాబ‌ల్యానికి పెను స‌వాల్ విసురుతోంది. ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ వ్య‌వ‌హార శైలి దూకుడుగా ఉంటుంద‌న్న‌ది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే అయినా ఆ దేశం ఇంతకు తెగిస్తుంద‌ని ఊహించ‌ని ప‌శ్చిమ‌దేశాలు ఇప్పుడు బిత్త‌ర చూపులు చూస్తున్నాయి. ర‌ష్యాపై క‌ఠిన ఆంక్ష‌లు విధిస్తామ‌ని అమెరికాతో పాటుగా యూరోపియ‌న్ దేశాలు చేస్తున్న‌ హెచ్చ‌రిక‌ల‌ను ర‌ష్యా అధ్యక్షుడు ఏమాత్రం లెక్క చేయ‌డం లేదు. గ‌తంలో ర‌ష్యా ఇదే త‌ర‌హా దుందుడుకు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిన స‌మ‌యంలో నాటో కూట‌మి విధించిన ఆర్థిక ఆంక్ష‌లు ఆ దేశంపై తీవ్ర ప్ర‌భావాన్ని చూపాయి. కానీ ఇప్పుడు ర‌ష్యా పూర్తి స‌న్న‌ద్ధ‌త‌తో ఉంది. విదేశీ మార‌క ద్ర‌వ్యం విష‌యంలోనూ ప‌రిపుష్టంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఆయుధాల ప‌రంగా, సైనిక ప‌రంగా ఆ దేశం ఎప్పుడూ అత్యంత శ‌క్తిమంత‌మైన‌దే.

ఇంత‌కూ ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడికి నేప‌థ్య‌మేమిటంటే..
ర‌ష్యాకు ఉక్రెయిన్ కూ ఉన్న విభేదాలు ఈనాటివి కాదు.. వీటికి మూడు ద‌శాబ్దాలకుపైగానే చ‌రిత్ర ఉంది. ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం కొన‌సాగుతున్న కాలంలోనే ఇవి మొద‌ల‌య్యాయ‌ని చెప్పాలి. ఒక‌నాటి అత్యంత బ‌ల‌వ‌త్త‌ర‌మైన సోవియ‌ట్‌ యూనియ‌న్లో ఉక్రెయిన్ కూడా ఒక భాగం. ఆ యూనియ‌న్ విచ్చిన్నం అయ్యేందుకు కార‌ణ‌మైన అనేక అంశాల్లో 1990లో ఉక్రెయిన్‌లో మొద‌లైన క‌మ్యూనిస్టు వ్య‌తిరేక ఉద్య‌మం కూడా ప్ర‌ధాన‌మైన‌ద‌నే చెప్పాలి. అంతేకాదు యూనియ‌న్‌ను ధిక్క‌రిస్తూ అదే ఏడాది జూలైలో ఉక్రెయిన్ స్వాతంత్రం ప్ర‌క‌టించుకుంది. త‌ద‌నంత‌ర ప‌రిణామాలు, చితికిన ఆర్థిక వ్య‌వ‌స్థ కార‌ణంగా 1991 డిసెంబ‌ర్‌లో సోవియ‌ట్ యూనియ‌న్ విచ్ఛిన్న‌మైంది. నాడు ఆ ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దేందుకు అవ‌స‌ర‌మైన ఆర్థిక స్థోమ‌త కూడా ర‌ష్యా ప్ర‌భుత్వానికి కొర‌వ‌డ‌టంతో క‌ర‌డుగ‌ట్టిన క‌మ్యూనిస్టు అనుకూల నేత‌లు ఈ ప‌రిణామాల‌న్నింటినీ నిస్స‌హాయంగా చూస్తుండిపోయారు. అగ్ర‌రాజ్యం అమెరికాతోపాటు నాటో కూట‌మి దీని వెనుక ఉంద‌న్న‌ది ర‌ష్యా నేత‌ల భావ‌న‌. ఈ నేప‌థ్యంలోనే పుతిన్ ర‌ష్యా అధ్య‌క్షుడైన నాటినుంచి గ‌త వైభ‌వాన్ని మ‌ళ్లీ పొంద‌డ‌మే ల‌క్ష్యంగా దేశాన్ని స‌న్న‌ద్ధం చేస్తూ వ‌స్తున్నారు. క్రిమియా ఆక్ర‌మ‌ణ కూడా ఈ విధానంలో భాగ‌మే. ఇప్పుడు ఉక్రెయిన్ వంతు వ‌చ్చింది.

నిజానికి సోవియ‌ట్ యూనియ‌న్ విడిపోయేనాటికి ఉక్రెయిన్ అమెరికా, ర‌ష్యాల త‌రువాత మూడో అత్య‌ధిక అణ్వ‌స్త్రాలు క‌లిగిన దేశంగా ఉంది. కాగా 1994 డిసెంబ‌ర్‌లో బుడాపెస్ట్ లో జ‌రిగిన ఒప్పందం ప్ర‌కారం అణ్వ‌స్త్ర నిరాయుధీక‌ర‌ణ‌కు అంగీక‌రించిన ఉక్రెయిన్ ప్ర‌భుత్వం త‌నవ‌ద్ద ఉన్న అన్ని అణ్వాయుధాల‌ను వ‌దులుకుంది. ఇందుకు ప్ర‌తిగా త‌న‌ను నాటో స‌భ్య దేశంగా చేర్చుకుంటార‌ని ఆ దేశం భావించింది. అయితే ర‌ష్యా తెలివిగా నాటో కూట‌మిలోని దేశాల‌ను బెదిరించ‌డం ద్వారా ఇప్ప‌టిదాకా అది జ‌ర‌గ‌కుండా అడ్డుకుంటూ వ‌చ్చింది. ఇప్పుడు క‌రోనా పాండ‌మిక్ కార‌ణంగా ప్ర‌పంచ దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు కుదేలైన స‌మ‌యాన్ని ఎంచుకుని ఉక్రెయిన్ ఆక్ర‌మ‌ణ మొద‌లుపెట్టింది.

 
ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడి ద‌రిమిలా సంభ‌వించే త‌ద‌నంత‌ర ప‌రిణామాలు ఎలా ఉంటాయోన‌న్న భ‌యంతో భార‌త్ స‌హా ప్ర‌పంచంలోని ప‌లు దేశాల స్టాక్ మార్కెట్లు కుప్ప‌కూలుతున్నాయి. ప్ర‌ముఖ కంపెనీల షేర్లు సైతం చిగురుటాకుల్లా వ‌ణుకుతున్నాయి. ఇక ర‌ష్యా స్టాక్ మార్కెట్ లో అయితే మ‌దుప‌రుల సంప‌ద ఏకంగా 250 బిలియ‌న్ డాల‌ర్ల మేర క‌రిగిపోయింది. ఇది రూపాయ‌ల్లో చెప్పాలంటే రూ. 18 ల‌క్ష‌ల కోట్ల‌కు పైమాటే. ఇది మూడో ప్ర‌పంచ యుద్ధంగా మారుతుందా అన్న భ‌యాందోళ‌న‌లూ మొద‌ల‌య్యాయి. కానీ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అమెరికా స‌హా నాటో కూట‌మి దేశాలు ర‌ష్యాపై ఆర్థిక ఆంక్ష‌ల‌కు మాత్ర‌మే ప‌రిమితం కావ‌చ్చు. ర‌ష్యాకు వ్య‌తిరేకంగా ఏదేశం కూడా ఉక్రెయిన్‌కు సైనిక సాయం అందించే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఉక్రెయిన్ ఎంతోకొంత‌ ప్ర‌తిఘ‌టించినా నిస్స‌హాయంగా ర‌ష్యా ఆక్ర‌మ‌ణ‌ను అంగీక‌రించక‌ త‌ప్ప‌క‌పోవ‌చ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: