తాజాగా మొదలైన పోలవరం నిధుల వివాదంతో అందరి దృష్టి తమిళనాడు మీద పడింది. ఏపిలో పోలవరానికి తమిళనాడు రాష్ట్రానికి ఏమిటి సంబంధం ? అనే డౌటనుమానం రావచ్చు. నిజానికి సాంకేతికంగా చూస్తే ఎటువంటి సంబంధం లేదు. కానీ మానసికంగా, రాజకీయంగా మాత్రం పోలికలు అనివార్యమయ్యాయి.  రాష్ట్రాభివృద్ధి విషయంలో తమిళనాడును చూసి ఏపిలోని రాజకీయ పార్టీలు, నేతలు నేర్చుకోవాల్సింది చాలానే ఉందనిపిస్తోంది. ఎందుకంటే  ఏపితో పోల్చుకుంటే తమిళనాడులో రాజకీయపార్టీలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. రాష్ట్రంలో అధికారం కోసమో లేకపోతే ఆధిపత్యం కోసమో తమలో తాము ఎంతైనా గొడవలుపడతాయి. కానీ రాష్ట్రాభివృద్ధి లేకపోతే రాష్ట్రప్రయోజనాల కోసం అన్నీ పార్టీలు ఏకమైపోతాయి. కేంద్రంతో పోరాటమో లేదంటే పొరుగు రాష్ట్రాలతో తగాదాలు వచ్చినపుడో అయితే  తమిళనాడు సంగతి ఇక చెప్పనే అక్కర్లేదు.




కేరళతో ముళ్ళపెరియార్ డ్యాం వివాదం కావచ్చు, కర్నాటకతో కావేరీ నదీ జలాల పంపిణీ వ్యవహారం కావచ్చు తమిళనాడు సత్తా ఏమిటో యావత్ దేశానికి అర్ధమైపోయింది. ఇక తమిళనానడులోని సంప్రదాయ క్రీడ జల్లికట్టు నిషేంధం విషయంలో యావత్ పార్టీలు, ప్రజలు ఏకమై న్యాయస్ధానాలను, కేంద్రాన్ని ఎలా గడగడ లాడించారో అందరు చూసిందే. మరి అదే స్పూర్తి ఏపిలోని రాజకీయ పార్టీల్లో, జనాల్లో ఎందుకు కనిపించటం లేదు ? అన్నదే ప్రధానమైన ప్రశ్న. అసలు రాష్ట్ర విభజనే అడ్డుగులుగా జరిగిన ప్రక్రియ. విచిత్రమేమిటంటే మెజారిటి జనాలు రాష్ట్ర విభజన వద్దని మొత్తుకున్నా సరే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం విభజించేసింది. దానికి బీజేపీ, టీడీపీ లాంటి పార్టీలు మద్దతు పలికాయి. ఇక అప్పటి నుండి ప్రతి విషయంలోను ఏపికి అన్యాయమే జరుగుతోంది. ఆస్తులను, రాజధాని హైదరాబాద్ ను తెలంగాణాకు ఇచ్చేసి అప్పులను మాత్రం ఏపి నెత్తిన చుట్టడమే విచిత్రం. అప్పుడు కూడా ఏపిలోని రాజకీయపార్టీలేవీ పోరాటం చేయలేదు. ఏదో మొహమాటం కోసం విభజ చట్టం అనేదాన్నొకటి చేసి యూపీఏ అధికారంలో నుండి దిగిపోయింది.




ఇక ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ఏపికి ఎంత అన్యాయం చేయాలో అంతా చేస్తోంది. విభజన చట్టాన్ని తూట్టుపొడిచేసింది. ప్రత్యేకహోదా గాలికి కొట్టుకుపోయింది. విశాఖ కేంద్రంగా ఇస్తానని చెప్పిన ప్రత్యేక రైల్వేజోన్ ఎటుపోయిందో తెలీదు. లోటు బడ్జెట్లో ఎంత రీఎంబర్స్ చేసిందో తెలీదు. పోలవరం నిర్మాణ బాధ్యత నుండి కేంద్రం దాదాపు తప్పుకున్నట్లే. ఇపుడీ అంశమే రాష్ట్రంలో మంటలు మండిస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తి బాద్యత వహించాల్సిన కేంద్రం ఇపుడు నిధులివ్వటానికి ఇష్టపడటం లేదు. ఏవో కాకిలెక్కలు చూపించి ఇక ఇవ్వాల్సిందే మమా అయితే రూ. 4 వేల కోట్లే అని తేల్చేసింది.  ఈ మొత్తం ప్రాజెక్టు నిర్మాణంలో ఏ మూలకు రాదు. విచిత్రమేమిటంటే కేంద్రం అన్యాయం చేస్తున్నా రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఒకదానిపై మరొకటి ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నాయి.




ఏపికి సంబంధించిన ప్రతి విషయంలోను కేంద్రం ఇలాగే వ్యవహరిస్తున్న రాజకీయ పార్టీలన్నీ ఏకమై నిలదీయటం లేదు. ఈ అనైక్యతనే కేంద్రం తనకు అనుకూలంగా మార్చుకుంటున్నది. అదే తమిళనాడులో పార్టీల్లాగే ఏపిలో కూడా పార్టీలన్నీ ఏకమైతే కేంద్రం తలొంచకుండానే ఉంటుందా ?  ఎందుకు తలొంచదు ? కానీ అది జరిగే పనికాదు. ఆ విషయం కేంద్రానికి కూడా బాగా తెలుసు. నిజంగా మాట్లాడుకోవాలంటే ఏపిలోని రాజకీయ పార్టీలకు రాష్ట్రాభివృద్ధిపైన శ్రద్ధ లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీలన్నీ ఏకమవ్వాలనే ఆలోచన పార్టీలకు రాకపోవటం ప్రజలు చేసుకున్న దురదృష్టం. ఎంతసేపు ప్రత్యర్ధిపార్టీపై తమదే పై చెయ్యి కావాలన్న ఆలోచనే కానీ రాష్ట్రం దెబ్బతినేస్తోందన్న స్పృహ ఏ ఒక్క పార్టీలోను కనబడటం లేదు. నిన్న చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి సిఎం. రేపు అధికారంలో ఎవరుంటారో ఎవరు చెప్పలేరు.




అశాశ్వతమైన అధికారం కోసం శాశ్వతమైన రాష్ట్రప్రయోజనాలను కూడా పణంగా పెట్టడానికి మన రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయంటే ఏమిటర్ధం ? ఇటువంటి దరిద్రపు రాజకీయవాతావరణానికి చంద్రబాబునో లేకపోతే  జగన్నో నిందించి ఉపయోగం లేదు. లేకపోతే పోలవరం విషయంలో ఏపికి కేంద్రం అన్యాయం చేస్తున్న విషయం స్పష్టంగా తెలుస్తున్నా బీజేపీ నేతలు చంద్రబాబు, జగన్ పైనే ఆరోపణలు చేస్తున్నారు  కానీ కేంద్రప్రభుత్వాన్ని మాత్రం నిలదీయటం లేదు.  బహుశా ఇటువంటి చవకబారు రాజకీయం ఒక్క ఏపిలో మాత్రమే కనబడుతోందేమో. వ్యవసాయ సంస్కరణల బిల్లుకు వ్యతిరేకంగా పంజాబ్ లో రాజకీయ పార్టీలన్నీ ఏకమయ్యాయి. అటువంటిది పోలవరం ప్రాజెక్టు విషయంలో  ఏపిలో పార్టీలు మాత్రం ఏకం కాలేకపోవటం దురదృష్టమనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: