ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగి సత్తా చాటిన డబ్బింగ్ చిత్రం ‘మాస్టర్’. దళపతి విజయ్‌, మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి కలిసి నటించిన ఈ చిత్రం మంచి కలెక్షన్లు రాబట్టింది. దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌ కూడా మంచి మార్కులే వేయించుకున్నాడు. కానీ సినిమా విజయ్ స్థాయిలో లేదని కొందరు నీళ్లు నములుతున్నారు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదలై మంచి వసూళ్లతో దూసుకు పోతోంది. ఇప్పుడు ఈ సినిమాను హిందీలో రీమేక్‌ చేయడానికి సన్నాహాలు మొదలు అయిపోయాయట. ఈ మేరకు కోలీవుడ్ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో బాల నేరస్థులతో నేరాలు చేయించే విలన్‌ పాత్రలో విజయ్‌ సేతుపతి అద్భుతంగా నటించాడు.

ఆ పిల్లలను సరైన దారిలో పెట్టడానికి ప్రయత్నించే మాస్టర్‌ పాత్రలో విజయ్‌ కూడా తన పాత్రకు న్యాయం చేశారు. సినిమాలో చాలా పాత్రలు ఉన్నప్పటికీ, ఈ రెండు పాత్రల మధ్యనే ఎక్కువగా కథ రన్‌ అవుతుంది. ఇదే బాలీవుడ్ నిర్మాతలకు బాగా నచ్చిందట. అందుకే దీన్ని హిందీలో రీమేక్ చేయాలని అనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. దీని కోసం స్టార్ హీరోలతో ఇప్పటికే సంప్రదింపులు జరుగుతున్నాయట. హీరో విజయ్‌ పాత్రలో బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్‌ రోషన్‌ ను తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో విజయ్‌ సేతుపతి రోల్‌లో మళ్లీ ఆయన్నే నటింప చేయాలని బాలీవుడ్‌ మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారట. విజయ్‌ సేతుపతి బాలీవుడ్‌ ప్రేక్షకులకూ సుపరిచితమేనట.

ఇక్కడ ఆయన కొన్ని సినిమాలు చేస్తున్నారట. ఈ క్రమంలో విజయ్ పాత్ర తనతోనే చేయిస్తే బావుంటుందని ఆలోచిస్తున్నారని సమాచారం. ఈ వార్తల్లో నిజా నిజాలు తెలియాలంటే మాత్రం కొన్నిరోజులు ఆగాల్సిందే. కాగా, ఇటీవలే విజయ్ సేతుపతి సినిమాలో బాలీవుడ్ కత్రినా కైఫ్ నటిస్తోందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అది నిజం కాదని, సేతుపతే హిందీకి వెళ్తున్నారని కూడా అంటున్నారు. మరి దీనిపై సేతుపతి నోరు విప్పే వరకూ సస్పెన్స్ తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: