ఇండస్ట్రీలో స్టార్ కావడం అంటే కేవలం ఎప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చామన్నది కాదు.. ప్రేక్షకులను ఎంతవరకు అలరించగలిగామా, అభిమానులను సంపాదించగలిగామా అనేదే అసలు మేటర్. ఈ రోజుల్లో కొత్త హీరోలు మాత్రమే కాదు, సీనియర్ స్టార్‌లు కూడా ట్రెండ్స్‌కి అనుగుణంగా ముందుకు సాగాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి సందర్భంలో తాజాగా అందరి నోటా వినిపించే పేరు తేజ సజ్జా. చిన్నప్పుడు సినిమాల్లో క్యూట్ డైలాగులు, అందమైన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న తేజ, ఇప్పుడు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న బిగ్ స్టార్‌గా మారిపోయాడు. ఆయన ఇప్పటివరకు నటించిన సినిమాలు ఎక్కువ కాకపోయినా, ప్రతి ప్రాజెక్ట్‌కి ఒక ప్రత్యేక కాన్సెప్ట్‌ను హైలైట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.


ప్రస్తుతం తేజ నటించిన ‘మీరాయ్’ సినిమా కోసం ఆయన బిజీగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. సాధారణంగా ఇప్పటికే ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలు సినిమాల ప్రమోషన్ విషయంలో పెద్దగా శ్రద్ధ చూపించరు, తమ సినిమా ఫ్యాన్స్ ఎలాగైనా హిట్ చేస్తారనే నమ్మకం వారిలో ఉంటుంది. కానీ తేజ మాత్రం పూర్తిగా భిన్నం. సినిమాకి సంబంధించిన ప్రతీ విషయాన్ని ప్రేక్షకులకి చేరవేయడానికి ఆయన కష్టపడుతున్నారు. ప్రతి ఈవెంట్‌లో స్వయంగా హాజరై, మీడియా అడిగే ప్రతి ప్రశ్నకు సహనంతో సమాధానం ఇస్తున్నారు.



ఇలా సినిమాను ప్రమోట్ చేస్తూ ఫ్యాన్స్‌తో మమేకమవుతున్న తేజను సోషల్ మీడియాలో అందరూ ప్రశంసిస్తున్నారు. అంతేకాదు, చాలా మంది అభిమానులు “తేజ సజ్జా - నాని లానే ప్రమోషన్స్ చేస్తున్నారు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో నేచురల్ స్టార్ నాని తన సినిమాల ప్రమోషన్ విషయంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆయన ఒక సినిమా రిలీజ్ అవ్వడానికి మూడునెలల ముందే పబ్లిసిటీ కోసం తన కాల్‌షీట్స్ కేటాయించి పక్కా ప్లాన్ తో ఉంటారు.  ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం లాంటి ప్రధాన నగరాల్లో నిరంతరం పర్యటిస్తూ సినిమా బజ్‌ను పెంచుతుంటాడు. నాని కష్టపడే తీరు వల్లనే ఆయనకు ఈ స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ఆయన సినిమా ప్రమోషన్స్‌లో కేవలం కథ గురించి చెప్పడం కాదు, సినిమా చూడటం వల్ల ప్రేక్షకులకు లభించే అనుభవాన్ని వివరంగా పంచుకోవడమే ప్రత్యేకం.



తేజ కూడా అదే పంథాను అనుసరిస్తున్నాడు. ‘మీరాయ్’ సినిమా ప్రమోషన్స్ కోసం ఇప్పటికే ముంబై, దుబాయ్, బెంగళూరు, చెన్నై పర్యటనలు ముగించారు. త్వరలో విశాఖపట్నం, ఢిల్లీ, వారణాసి వంటి నగరాల్లో కూడా ప్రత్యేక ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలు ఇచ్చిన తేజ, మిగతా కార్యక్రమాలపై కూడా ప్రత్యేక ప్లానింగ్ చేస్తున్నారు. మొత్తం మీద తేజ సజ్జా, నాని అడుగుజాడల్లో నడుస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. బహుశా నాని పీఆర్ టీమ్, డిజిటల్ మార్కెటింగ్ టీమ్ కూడా తేజ సినిమాకు సహకరించడం వల్ల ఈ స్థాయి ప్రమోషన్ జరుగుతోందేమో అని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏదేమైనా, తేజ తన కష్టంతో, డెడికేషన్‌తో ఈ తరానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు అనడం అతిశయోక్తి కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: