టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి సినిమా గురించి రోజురోజుకీ కొత్త అప్‌డేట్స్ వెలువడుతూ ఫ్యాన్స్‌లో ఆసక్తి పెంచుతున్నాయి. ఈ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ ఉందన్న వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పుడు ఆ వార్తలకు పక్కా క్లారిటీ వచ్చింది. డీజే టిల్లు మూవీతో మంచి క్రేజ్ తెచ్చుకున్న నేహాశెట్టి ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేస్తోందని స్వయంగా ఆమెనే క్లారిటీ ఇచ్చేశారు. నేహాశెట్టి “OGలో ఓ సర్‌ప్రైజ్ ఉంది” అంటూ, తాను పవన్ కళ్యాణ్‌తో పాటుగా కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా నటించానని చెప్పారు.


దీంతో ఈ ఐటమ్ సాంగ్ మాత్రమే కాదు, నేహాశెట్టి పాత్ర కూడా సినిమాకి స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా నిలుస్తుంద‌ని సినీ వర్గాలు భావిస్తున్నాయి. యంగ్ డైరెక్ట‌ర్ సుజిత్ రూపొందిస్తున్న ఈ చిత్రం ప్యూర్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పవన్ కళ్యాణ్ శైలికి తగ్గట్లుగా మాస్ యాక్షన్, స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ డైలాగులు ఈ సినిమాకి హైలైట్ కానున్నాయని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.


ఇప్పటికే పవన్ కళ్యాణ్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేశారు. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో ప‌వ‌న్ త‌న పాత్ర‌కు డబ్బింగ్ చెబుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ప‌వ‌న్‌ చెప్పే డైలాగులు ఫ్యాన్స్‌కి గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంటాయని మేకర్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్‌గా, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఎస్‌. ఎస్‌. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. పవన్ కెరీర్‌లోనే వేరే స్థాయిలో నిలిచే సినిమా అవుతుందని అభిమానులు నమ్ముతున్నారు. నేహాశెట్టి ఎంట్రీతో సినిమా మీద హైప్ మరింత పెరిగింది. ఇప్పుడు అందరి చూపు ఈ స్పెషల్ సాంగ్‌పై పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: