ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సరిగ్గా రెండున్నర ఏళ్లు పూర్తైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత... రాష్ట్ర రాజధాని విషయం కీలక చర్చగా మారింది. అధికారంలోకి రాక ముందు నుంచే... రాజధాని పేరుతో భారీ భూ కుంభకోణం జరిగిందని ఎన్నో ఆరోపణలు చేశారు. ఇన్ సైడర్ ట్రేడింగ్‌పై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని కూడా ప్రకటించారు. అన్నట్లుగానే అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీ సీఐడీ విచారణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రాజధాని నిర్మాణాన్ని పక్కన పెట్టేశారు. వినూత్నంగా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పరిపాలన రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతిని 2019 డిసెంబర్ నెలలో ప్రకటించారు జగన్. అయితే నాటి నుంచి అమరావతి ప్రాంత రైతులు ఆందోళనలు చేపట్టారు. కోర్టు కేసులు, ఢిల్లీ పర్యటనలు.. ఇలా తమ నిరసనలను 600 రోజులు పైగా కొనసాగిస్తూనే ఉన్నారు.

జగన్ సర్కార్ నిర్ణయం అయితే తీసుకుంది కానీ... పనులు మాత్రం ముందుకు సాగలేదు. ఇప్పటికీ అమరావతి నుంచే పరిపాలన కొనసాగుతోంది. అయితే మంత్రులు మాత్రం త్వరలోనే రాజధాని విశాఖకు తరలిపోతుందని ప్రకటిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంత రైతులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఓ వైపు న్యాయ పోరాటం చేస్తూనే... నిరసనలో కొనసాగిస్తున్నారు అమరావతి వాసులు. దాదాపు 22 నెలలుగా నిరసనలు చేస్తూన్నా కూడా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో... తమ ఆందోళనను మరింత తీవ్రం చేస్తున్నారు. డిసెంబర్ 17వ తేదీ నాటికి మూడు రాజధానుల ప్రకటన వచ్చి రెండేళ్లు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో మహా పాదయాత్ర నిర్వహించాలని రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధాని ఐక్య కార్యాచరణ సమితీ ఆధ్వర్యంలో నవంబర్ ఒకటవ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. తుళ్లూరు నుంచి తిరుమల వరకు... న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో యాత్ర చేస్తున్నట్లు ఐకాస నేతలు వెల్లడించారు. డిసెంబర్ 17వ తేదీన తిరుమల శ్రీవారికి తమ విన్నపాల లేఖను సమర్పిస్తామన్నారు ఐకాస నేతలు.


మరింత సమాచారం తెలుసుకోండి: