తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బుధవారం జరగాల్సిన ఈసెట్ పరీక్షను వాయిదా వేసినట్టు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి వెల్లడించారు. త్వరలోనే రీషెడ్యూల్ ప్రకటిస్తామని తెలిపారు. ఈసెట్ కోసం 24వేల 65మంది దరఖాస్తు చేసుకున్నారు. 51పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. అయితే ఓయూ పరిధిలో 14వ తేదీ నుంచి పరీక్షలను యథావిధిగా నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

హైదరాబాద్ నగరంలో రానున్న 12గంటల పాటు బలమైన ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షం పడుతుందని జీహెచ్ ఎంసీ హెచ్చరించింది. ఈ రోజు రాత్రి 10.30గంటల వరకు బలమైన గాలులు వీస్తాయని, చెట్లు విరిగిపడే అవకాశముందని పేర్కొంది. చెట్ల కింద ఎవరూ ఊండొద్దని హెచ్చరించింది. ఎమర్జెన్సీ కోసం డీఆర్ఎఫ్ బృందాలు ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది.

ఇక నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి, సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో నేడు అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48గంటల్లో మరింత బలపడుతుందని పేర్కొంది. దీనివల్ల 15వ తేదీ వరకు వర్షాలు కొనసాగుతాయని వెల్లడించింది.

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పాటు రాష్ట్రంలో పడుతున్న భారీ వర్షాలతో గోదావరికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద ప్రవాహం 53.40అడుగులకు చేరింది. ప్రస్తుతం మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం నదిలో 14లక్షల 45వేల 47క్యూసెక్కుల ప్రవాహం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు జలపాతాలన్నీ మళ్లీ జీవం పోసుకుంటున్నాయి. పాలనురుగుల లాంటి నీళ్లతో కిందికి దూకుతున్నాయి. తాజాగా కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లాలోని గుండాల జలపాతం చూపరులను మంత్రముగ్దులను చేస్తోంది. చుట్టూ పచ్చని చెట్లు.. కొండపై నుంచి జాలువారుతున్న ఈ జలపాతాన్ని బాహుబలి జలపాతం అని  పిలుస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: