
కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలే కాకుండా, ఏకంగా పాకిస్తాన్ భూభాగంలోని ముష్కర శిబిరాలను సైతం మన సైన్యం టార్గెట్ చేసింది. కోట్లీ, ముజఫరాబాద్, రావల్పిండి సమీప ప్రాంతాలు, బహవల్పూర్ సహా మొత్తం తొమ్మిది చోట్ల ఏకకాలంలో దాడులు జరిపి, పాక్ సైనిక వర్గాలనే నిశ్చేష్టులను చేసింది. ఈ విషయాన్ని స్వయంగా పాకిస్తాన్ ఆర్మీయే ధృవీకరించడం కొసమెరుపు.
ఈ మెరుపు దాడులకు భారత సైన్యం "ఆపరేషన్ సింధూర్" అని నామకరణం చేసింది. అంటే, పాకిస్తాన్ నుదుటిన చెరగని సింధూరం దిద్ది వచ్చామని మన సైన్యం చెప్పకనే చెప్పింది. యుద్ధతంత్రంలో అత్యంత కీలకమైన "సర్ప్రైజ్ ఎలిమెంట్" ను భారత్ అద్భుతంగా ఉపయోగించుకుంది. దేశవ్యాప్తంగా ఎయిర్ డ్రిల్స్ జరుగుతాయని, ఆ తర్వాతే ఏదైనా ఉంటుందని పాకిస్తాన్ నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంది. కానీ, మన వ్యూహకర్తలు వాళ్ల అంచనాలను తలకిందులు చేస్తూ, తెల్లవారుజామునే క్షిపణి దాడులతో విరుచుకుపడ్డారు. పాక్ తేరుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
పాకిస్తాన్ వద్ద సరైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ లేకపోవడం మన దాడికి మరింత కలిసొచ్చింది. చైనా, ఇరాన్, టర్కీ వంటి దేశాలు ఆయుధాలు ఇస్తామన్నా, వాటిని కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేని పాక్, ఇప్పుడు చేతులు కాల్చుకుంది. మన క్షిపణులు నిరాటంకంగా లక్ష్యాలను ఛేదించాయి. ఒకవేళ వారికి పటిష్టమైన రక్షణ వ్యవస్థ ఉండిఉంటే, మన మిస్సైళ్లను మధ్యలోనే అడ్డుకునే ప్రయత్నం చేసేవారు. కానీ, ఆ అవకాశం వారికి దక్కలేదు.
గతంలో సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులతో గుణపాఠం చెప్పినా, ఈసారి ఏకంగా క్షిపణులతో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించింది భారత్. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా, శత్రువు ఊహించని రీతిలో దాడులు చేయడం మన సైనిక పాటవానికి నిదర్శనం. గత దాడులపై అనుమానాలు వ్యక్తం చేసిన స్వదేశీ 'మేధావులకు' ఈసారి క్షిపణులు దూసుకెళ్తున్న దృశ్యాలు, విధ్వంసకర దాడుల విజువల్స్ సమాధానం చెబుతున్నాయి.
నిపుణులు అంటున్న మాట ప్రకారం, ఇది కేవలం యుద్ధం కాదు, పాకిస్తాన్ పై భారత దండయాత్రగా అభివర్ణించాలి. వాళ్లు తేరుకుని ప్రతిదాడి చేసే లోపే, మన సైన్యం తన పని తాను చేసుకుపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ప్రతీకార దాడులు ఉండే అవకాశం ఉంది, దానికి భారత్ సర్వసన్నద్ధంగా ఉంది.
అయితే, ఇప్పుడు దేశంలోపల ఉన్న కొందరు దేశద్రోహులు, విచ్ఛిన్నకర శక్తులు కూడా రెచ్చిపోయే ప్రమాదం ఉంది. వారితో అంతర్గత పోరాటానికి కూడా సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రస్తుతం, యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి, అసలు పోరాటం ఆరంభమైంది.