హైదరాబాద్ మహానగరంలో హాస్టళ్ల వ్యాపారంపై అకాల మేఘాలు కమ్ముకున్నాయి. ప్రభుత్వాల మార్పులతో వచ్చే నీటి కష్టాలు, విద్యుత్ కోతలు వంటి చిన్నా చితకా సమస్యలు కావివి. ఏకంగా హాస్టళ్ల మనుగడనే ప్రశ్నార్థకం చేసేలా, ఆక్యుపెన్సీ అగాధంలోకి జారిపోతున్న వైనమిది. భాగ్యనగరం ఇప్పుడు హాస్టళ్ల విషయంలో ఓ కొత్త సంక్షోభపు సుడిగుండంలో చిక్కుకుందన్నది నమ్మలేని నిజం.

ఒకప్పుడు విద్యార్థులు, ఉద్యోగార్థులతో నిరంతరం కళకళలాడిన అమీర్‌పేట, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, ఎల్బీ నగర్, జేఎన్టీయూ పరిసర ప్రాంతాల్లోని హాస్టళ్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. వేలల్లో ఫీజులు చెల్లించినా కనీసం బెడ్ దొరకని పరిస్థితి నుంచి, సగం గదులు కూడా నిండని దయనీయ స్థితికి చేరుకున్నాయి. సాఫ్ట్‌వేర్ కోర్సుల కోసం, ఉజ్వల భవిష్యత్తు కోసం వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే యువతతో కిటకిటలాడిన వసతి గృహాలు నేడు బోసిపోయి కనిపిస్తున్నాయి.

అటు ఫైనాన్స్ సిటీ, మాదాపూర్, మియాపూర్ చుట్టుపక్కల ఉద్యోగులతో నిండిపోయి, నెలకు పది, పదిహేను వేల రూపాయల అద్దెలతో నడిచే హాస్టళ్లలోనూ ఇదే తీరు. అక్కడ ఖరీదైన వసతులు, నాణ్యమైన భోజనం అందించినా, ఉండటానికి మనుషులు కరువయ్యారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.

ఈ అనూహ్య సంక్షోభానికి అసలు సిసలు కారణం సాఫ్ట్‌వేర్ రంగంలో నెలకొన్న పెను కల్లోలం. అగ్రరాజ్యం అమెరికాలో విధానపరమైన మార్పులు, ఆర్థిక మాంద్యం భయాలతో మన ఐటీ కంపెనీలకు ప్రాజెక్టుల ప్రవాహం అమాంతం ఆగిపోయింది. దీంతో, నిన్నటిదాకా ల్యాప్‌టాప్‌లతో బిజీబిజీగా గడిపిన టెక్కీలు, నేడు పింక్ స్లిప్పుల పదునైన వేటుకు బలవుతున్నారు. "కొన్నాళ్లు ఇంట్లోనే ఉండండి" అంటూ కంపెనీలు చెబుతుండటంతో, నోటీస్ పీరియడ్ అనే మాట కూడా లేకుండా, అర్ధాంతరంగా ఉద్యోగాల నుంచి బయటకు పంపేస్తున్నారని బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఉన్న ఉద్యోగాలు ఊడిపోతుంటే, కొత్త అవకాశాలు అడుగంటిపోవడంతో, హాస్టళ్లలో ఉంటున్నవారు మూటాముల్లె సర్దుకుని సొంతూళ్లకు పయనమవుతున్నారు. కొత్తగా నగరానికి వచ్చే వారి సంఖ్య కూడా గణనీయంగా పడిపోయింది. ఫలితంగా, చాలా హాస్టళ్లలో 50 శాతం ఆక్యుపెన్సీ కూడా కష్టతరంగా మారిందని నిర్వాహకులు లబోదిబోమంటున్నారు.

ఈ ప్రభావం కేవలం హాస్టళ్లకే పరిమితం కాలేదు. వాటిపై ఆధారపడి బతుకుతున్న అనేక అనుబంధ వ్యాపారాలు సైతం కుదేలవుతున్నాయి. హాస్టళ్ల సమీపంలోని కర్రీ పాయింట్లు, టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, లాండ్రీలు, చివరకు కిరాణా కొట్ల వ్యాపారాలు కూడా మందగించాయి. హాస్టళ్లకు నిత్యావసరాలైన బియ్యం, పప్పులు, కూరగాయలు సరఫరా చేసే వ్యాపారులు మొదలుకొని, అక్కడ పనిచేసే వంటవాళ్లు, క్లీనింగ్ సిబ్బంది వరకు అందరిపైనా ఈ సంక్షోభం పిడుగుపాటులా పడింది.

ఆదాయం పడిపోయి, ఖర్చులు తడిసి మోపెడవుతుండటంతో, సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నామని, అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని పలువురు హాస్టల్ యజమానులు తమ ఆవేదన వెళ్లగక్కుతున్నారు.

ప్రస్తుతానికి ఇది కొందరి ఆవేదనగా, అక్కడక్కడా వినిపిస్తున్న మాటగానే ఉన్నప్పటికీ, నగరంలోని వందలాది హాస్టళ్లలో ఇదే పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. భాగ్యనగరంలో ఉపాధి కలలతో అడుగుపెట్టే యువతకు, వారికి నీడనిస్తున్న ఈ వసతి గృహాలకు ఇది నిజంగా గడ్డు కాలమనే చెప్పాలి. ఈ సంక్షోభం ఎంతకాలం కొనసాగుతుందో, దీని పర్యవసానాలు ఇంకెంత తీవ్రంగా ఉంటాయోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: