మొండివాడు రాజు కంటే బలవంతుడు అని ఒక సామెత ఉంది. అయితే అదే మొండివాడు రాజు అయితే ఏం జరుగుతుంది....చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా తెలంగాణా సీఎంని చెప్పుకోవాలి. కేసీయార్ మొండితనం గెలిచిందా, ఆయనలోని రాజు గెలిచాడా అంటే చెప్పడం కష్టం. ఎందుకంటే ఇద్దరి  బలం తోడై ఎర్ర బస్సు కి  శాశ్వతంగా  బ్రేకులే వేసాయి.

 

రెండు నెలల సమ్మె చేశారు ఆర్టీసీ కార్మికులు. మరో వైపు ముప్పయి మంది వరకూ ఆర్టీసీ కార్మికులు సమ్మె వల్ల  చనిపోయారు. ఇక ప్రజలు నానా కష్టాలు పడ్డారు. ఆర్టీసీ సమ్మె వల్ల మొత్తం జన జీవనం స్థంభించింది. అయినా మొక్కవోని దీక్షతో  కార్మికులు సమ్మె బాటని వీడలేదు. అయితే కేసీయార్ మాత్రం ఒక పట్టుదలతో,  పదునైన వ్యూహాంతో ముందుకు పోయారు.

 

దానికి తోడు తాను అనుకున్నది జరగాలని మొండికేసారు కూడా. ఆర్టీసీ కార్మికులే కాదు, జీవితంలో మళ్ళీ తెలంగాణాలో సమ్మె చేయాలంటేనే భయపడేవిధంగా కేసీయార్ గట్టిగానే వ్యవహరించారు. పర్యవశానం ఎటువంటి లాభపేక్ష లేకుండా అతి పెద్ద రవాణా సంస్థగా ఉన్న తెలంగాణా ఆర్టీసీ చక్రాలు ఇపుడు ఊడిపోతున్నాయి.

 

కొన్ని బస్సు రూట్లను ప్రైవేట్ కు ఇవ్వవచ్చు అంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో కేసీయార్ గెలిచినట్లు అయింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదన‌ప్పటినుంచి కేసీయార్ దూకుడుగానే ఉన్నారు. వారికి సరైన గుణపాఠం చెబుతానని ఆయన అంటూనే ఉన్నారు. చివరికి అనుకున్నది సాధించారు అంటున్నారు. బస్సు రూట్లు ప్రైవేట్ చేస్తే లాభం ఎవరికి అంటే ప్రభుత్వానికి భారం తగ్గిపోయినా ప్రజలకు మాత్రం ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఎందుకంటే ఒక్క ప్రయాణీకుడు ఉన్నా అతన్ని ఎక్కించుకుని వెళ్ళేది ఆర్టీసీ. ప్రైవేట్ వారికి వ్యాపారమే కావాలి.

 

ఇక బస్సు పాసులు వివిధ వర్గాలకు ఇస్తున్న రాయితీలు కూడా ఉండవు. అన్నిటికీ మించి వేలాదిమంది ఆర్టీసీ కార్మికులు ఉపాధి కోల్పోతారు. ప్రభుత్వాలు ప్రజల తరఫున ఎన్నిక అయినవి. అందువల్ల వారి గురించి కనీస  ఆలోచన చేయాలి. కానీ ఏ దశలోనూ సానుకూలంగా కేసీయార్ ఆర్టీసీ కార్మికుల సమస్యలపైన స్పందించలేదన్న విమర్శలు ఉన్నాయి. మొత్తానికి ముందే చెప్పుకున్నట్లుగా కేసీయార్ గెలిచారు.  ఎర్రబస్సు కి రెడ్ సిగ్నల్ పడింది అంతే

 

మరింత సమాచారం తెలుసుకోండి: