దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన దిశ ఘటన ఆడపిల్లల తల్లిదండ్రుల వెన్నులో వణుకు పుట్టించిందని చెప్పవచ్చూ. ఇక ఈ ఘటనపై అన్ని వర్గాల వారు గొంతెత్తారు. దిశకు న్యాయం జరిగే వరకు పోరాడారు. అత్యంత కిరాతకంగా అఘాయిత్యానికి ఒడిగట్టిన రాక్షసులను ఉరి తీయాలని, ఎన్‌కౌంటర్ చేసి చంపాలని డిమాండ్ చేశారు.

 

 

అందరూ ఆశించనట్లే జరిగింది. దిశను దారుణంగా చంపిన 10 రోజుల్లోపే ఆ మృగాళ్లు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. బాధితురాలిని సజీవదహనం చేసిన ప్రాంతానికి సమీపంలోనే దిక్కులేని కుక్క చావు చచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడే అసలు చిక్కొచ్చింది. పోలీసుల చర్యను తప్పుబడుతూ షాద్‌నగర్ ఎన్‌కౌంటర్‌పై ఓ స్వరం గొంతెత్తి అరుస్తోంది. ఆ స్వరం పేరు.. ‘మానవ హక్కులు’. ఎన్‌కౌంటర్ పేరుతో మానవ హక్కులను హరించారని.. నలుగురు నిందితులను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారని పలువురు ఆరోపిస్తున్నారు. తెలంగాణ పోలీసులపై లెక్కకుమిక్కిలి కేసులు నమోదవుతున్నాయి.

 

 

జాతీయ మానవ హక్కుల సంఘం సుమోటోగా కేసు నమోదు చేసి ఎన్‌కౌంటర్‌పై సమగ్ర దర్యాప్తు చేపట్టింది. విచారణ చేపట్టే వరకు మృతదేహాలను భద్రపరచాలని అటు తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఇక ఇలాంటి ఘటనల నేపధ్యంలో పోలీసుల పరిస్థితి ఏంటి? ఎన్‌కౌంటర్ తర్వాత జనం చేత జేజేలు కొట్టించుకున్న తెలంగాణ పోలీసులు ఇక కోర్టుల చుట్టూ తిరగాల్సిందేనా? చిక్కులు ఎదుర్కోవాల్సిందేనా? దిశ కేసు నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలని నిన్నటివరకూ నినదించిన జనం..

 

 

ఇప్పుడు  పోలీసులకు ఏ మేరకు మద్దతిస్తారు? ప్రస్తుతం ఇదే అంశం తెలంగాణాలో హాట్ టాపిక్‌గా మారింది.. ఇకపోతే ఇంతటి దారుణానికి కారణమైన రాక్షసులను ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపితే.. పోలీసులపై కేసులు వేయడం చాలా మందిని విస్మయానికి గురిచేస్తోంది. ఇలా మానవ హక్కుల సంఘాలు ప్రవర్తిస్తే మళ్లీ లోకంలో హాత్యాచారాలు చేసే వారు భయం లేకుండా యధేచ్చగా తమపని తాము చేసుకుంటూ సమాజాన్ని నాశనం చేయవచ్చనే వాదన వినిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: