కరోనా వైరస్ (కోవిడ్ 19) కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3 వేలు దాటింది. చైనాలో  మరో 42 మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో కరోనా బాధితులు ప్రాణ భయంతో వణికి పోతున్నారు.  ఇక, కొత్తగా మరో 202 మందికి వైరస్ సోకడంతో బాధితుల సంఖ్య 89 వేలకు చేరుకుంది. వైరస్ సోకిన వారిలో మరణాల రేటు రెండు నుంచి ఐదు శాతంగా ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కరోనా వైరస్‌తో మృతి చెందిన వారి సంఖ్య అమెరికాలో రెండుకు చేరింది. ఎంతో మంది ప్రాణాలు బలిగొన్నప్రాణాంతక కోవిడ్​-19 వైరస్ లక్షణాల​ కేసులు దిల్లీ, హైదరాబాద్‌లో నమోదయ్యాయి.

 

ఇటలీ నుంచి దిల్లీ వచ్చిన వ్యక్తిలో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. అలాగే దుబాయ్​ నుంచి హైదరాబాద్​ వచ్చిన వ్యక్తిలోనూ వైరస్​ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఆ ఇద్దరికీ వైద్యపరీక్షలు నిర్వహించి పరిశీలనలో ఉంచినట్లు కేంద్రం వెల్లడించింది. ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.  కాగా, హైదరాబాద్ నగరంలో ఓ కరోనా వైరస్ కేసు నమోదు కాగా..  ఈ రోగి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. బెంగుళూరులో పనిచేస్తున్నారు. వయసు 24 యేళ్లు. గత నెల 15వ తేదీన కంపెనీ పనిమీద దుబాయ్‌కు వెళ్లాడు. ఇతర దేశాలు, ప్రాంతాలకు చెందిన వ్యక్తులతో కలిసి అక్కడ పని చేశాడు. ఫిబ్రవరి 20న తిరిగి బెంగళూరుకు చేరుకున్నాడు.

 

27న జ్వరం రావడంతో.. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. అదే రోజు సికింద్రాబాద్‌ అపోలో ఆస్పత్రిలో చేరాడు. ఇక ఈ విషయంపై తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ..  మార్చి 1వ తేదీన సాయంత్రం 5 గంటలకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి.. గాంధీ ఆస్పత్రిలో చేరాడు. అతనికి కరోనా టెస్టులు చేయగా పాజిటివ్‌గా ఫలితం వచ్చింది. నిర్ధారణ కోసం పుణెకు కూడా పంపించం.. అక్కడ కూడా పాజిటివ్‌ ఫలితాలే వచ్చాయి. ఇదే విషయాన్ని కేంద్రానికి తెలిపాం అన్నారు.  రాష్ట్రంలో కరోనా వైరస్‌ నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: