క‌రోనా వైర‌స్‌తో ప్ర‌పంచ దేశాలు అల్లాడుతున్నాయి. ఇప్ప‌టికే మెజార్టీ దేశాలు ఇప్ప‌టికే లాక్‌డౌన్ ప్ర‌క‌టించాయి. ప్ర‌జ‌లంద‌రూ దాదాపుగా ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. అత్య‌వ‌స‌ర సేవ‌లు మాత్ర‌మే అందుబాటులో ఉంటున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా సుమారు 15వేల మందికిపైగా మ‌ర‌ణించిన‌ట్లు గ‌ణాంకాలు చెబుతున్నాయి. ఇక క‌రోనా దెబ్బ‌కు అమెరికా ఆర్థిక వ్య‌వ‌స్థ కుప్ప‌కూలిపోతోంది. వేలాదిమంది వైర‌స్‌బారిన ప‌డ్డారు. మృతుల సంఖ్య కూడా క్ర‌మంగా పెరుగుతోంది. రోజురోజుకూ ప‌రిస్థితి ఆందోళ‌న‌కరంగా నేప‌థ్యంలో ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌ర్చేందుకు, ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేందుకు డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కారు ట్రిలియన్‌ డాలర్ల ప్యాకేజీని సెనేట్‌లో ప్ర‌వేశ‌పెట్టింది. కానీ.. ట్రంప్‌కు ఊహించ‌ని ప‌రిణామం ఎదురైంది. అనుకోని దెబ్బ‌ప‌డింది. సెనెట్‌లో డెమోక్రాట్ల నుంచి ఈ ప్యాకేజీకి మద్దతు లభించలేదు. ఇదే స‌మ‌యంలో క‌రోనా వైర‌స్ ఎఫెక్టుతో అధికార రిపబ్లికన్‌ పార్టీకి చెందిన ఐదుగురు సభ్యులు క్వారంటైన్‌లో ఉండడంతో ఓటింగ్‌లో పాల్గొనలేక‌పోయారు.

 

మ‌రోవైపు ట్రంప్‌పై డెమోక్రాట్లు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్రస్తుత సంక్షోభం సమయంలో లక్షలాది మంది ప్రజలను రక్షించడంలో, వైద్యారోగ్య వ్యవస్థను మెరుగుపరచడంలో విఫలమ‌య్యార‌ని డెమొక్రాట్లు మండిప‌డ్డారు. దీంతో డెమోక్రాట్ల‌పై ట్రంప్ కూడా తీవ్ర‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. డెమోక్రాట్లు తమ రాజకీయ ఎజెండా అమలు చేయడానికి ఇది సమయం కాదని ట్రంప్ అన్నారు. తమ రాజకీయ ఎజెండా అమలులో భాగంగా డెమోక్రాట్లు సెనెట్‌లో చేసిన వాదనలు సరైనవి కావని ఆయ‌న విమ‌ర్శించారు. కరోనా వైరస్‌ మహమ్మారిని ఉపయోగించుకునేందుకు చూస్తున్నారని ఆయ‌న ఆరోపించారు. ఇదిలా ఉండ‌గా, క‌రోనా వైర‌స్ వ్యాప్తికి చైనానే కార‌ణ‌మంటూ డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఇది చైనా వైర‌స్ అంటూ ఆయ‌న మండిప‌డిన విష‌య తెలిసిందే. చైనా కూడా ఇదే స్థాయిలో విమ‌ర్శ‌ల‌ను తిప్పికొడుతోంది. కాగా, చైనాలో ఈ వైర‌స్‌తో 81 వేల మందికి సోక‌గా, 3261 మంది మ‌ర‌ణించారు. ఇట‌లీలో 53వేల మందికి సోకితే, ఇప్ప‌టికే 4825 మంది మృతి చెందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: