కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. ఒకటి అర దేశాలు లాక్ డౌన్ ఎత్తివేసినా ఎక్కువ శాతం కంట్రీస్ లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నాయి. అయితే లాక్ డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. 7 రోజుల్లో 12 దేశాల్లో ఉన్న 14, 800 మంది ప్రయాణీకులను 64విమానాల ద్వారా స్వదేశానికి తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. అయితే ప్రయాణ ఖర్చులు ప్రయాణీకులే భరించాలనీ.. క్వారంటైన్ ఖర్చులు మాత్రం ప్రయాణీకుల సంబంధిత రాష్ట్రాలు భరించాలని స్పష్టం చేసింది. 

 

విదేశాల్లో ఇరుక్కుపోయిన భారతీయులను దశల వారీగా స్వదేశానికి తీసుకొస్తామని ఇప్పటికే ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. అందుకోసం గట్టిగా ప్రయత్నిస్తోంది. అందుకోసం 64 విమానాలను సిద్దంగా ఉంచింది. మే 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మొత్తం 12 దేశాల్లోని దాదాపు 14,800 మందిని స్వదేశానికి చేర్చనుంది. అందుకోసం ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానాలు రెడీగా ఉన్నాయి. యూఏఈ, యూకే, అమెరికా, ఖతార్‌, సౌదీ అరేబియా, సింగపూర్‌, మలేషియా, ఫిలిప్పీన్స్‌, బంగ్లాదేశ్‌, బెహ్రెయిన్‌, కువైట్‌, ఒమన్ దేశాల నుంచి భారతీయుల్ని స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నం గట్టిగా జరుగుతోంది. 

 

యూఏఈకు 10 విమానాలు, అమెరికా, యూకేలకు చెరో ఏడు చొప్పున విమానాలను నడపనుంది. అలాగే సౌదీ అరేబియాకు ఐదు, సింగపూర్‌కు ఐదు, ఖతార్‌ నుంచి రెండు చొప్పున విమానాలు నడపుతారు. మలేషియా, బంగ్లాదేశ్‌లకు చెరో ఏడు, కువైట్‌, ఫిలిప్పీన్స్‌కు చెరో ఐదు, ఒమన్‌, బెహ్రెయిన్‌కు చెరో రెండు చొప్పున విమానాలు నడిపే అవకాశం ఉంది. మొత్తం 64 విమానాల్లో కేరళ నుంచి 15, ఢిల్లీ, తమిళనాడు నుంచి చెరో 11, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి చెరో ఏడు, మిగతా రాష్ట్రాల నుంచి ఐదు చొప్పున విమానాలు నడుస్తాయని కేంద్రం చెప్పింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: