ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. గడిచిన 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో 465 కరోనా కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. ఈ కేసులలో రాష్ట్రానికి సంబంధించిన 376 కేసులు ఉండగా ఇతర రాష్ట్రాలకు చెందిన 89 మంది కరోనా భారీన పడ్డారు. ఏపీలో ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 
 
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 499 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం కావడం గమనార్హం. మరోవైపు రాష్ట్రంలో మృతుల సంఖ్య 198కు చేరింది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే ముగ్గురు కరోనా భారీన పడి మృతి చెందారు. నిన్న నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే రికార్డు స్థాయిలో అత్యధికంగా 329 కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. 
 
తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజుల క్రితం వరకు వందలోపు నమోదైన కేసులు ప్రస్తుతం వేల సంఖ్యలో నమోదవుతూ ఉండటం ప్రజలను, అధికారులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. అన్ లాక్ 1.0 లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా సడలింపులు ఇవ్వడం వైరస్ విజృంభణకు కారణమవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు మాస్క్ ధరించడం, భౌతిక దూరంలాంటి నిబంధనలు పాటించకపోతే వేలల్లో కేసులు నమోదైనా ఆశ్చర్యం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
పలు ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా నిబంధనలు పాటిస్తున్నా పలు చోట్ల మాత్రం వ్యాపారులు సైతం మాస్క్ లు ధరించడం లేదు. వీరి వల్లే వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వాలు కఠినంగా నిబంధనలు అమలు చేసినా ప్రజలు జాగ్రత్తలు తీసుకోకపోతే వైరస్ వ్యాప్తిని అరికట్టలేమని నిపుణులు చెబుతున్నారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: