దుబ్బాక ఉప ఎన్నికతో ప్రస్తుతం రాజకీయ వేడి రాజుకుంది విషయం తెలిసిందే. టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యం బారిన పడి ఇటీవలే మరణించిన నేపథ్యంలో దుబ్బాక నియోజక వర్గంలో ఉప ఎన్నిక అనివార్యంగా  మారింది. ఇక మరికొన్ని రోజుల్లో దుబ్బాక నియోజక వర్గంలో ఎన్నికల తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ఎంతో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి . ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయగా.. దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ ముమ్మర ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు.



 ఈ క్రమంలోనే దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో శరవేగంగా పరిణామాలు మారిపోతున్నాయి. అటు అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు  రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఇక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బిజెపి పార్టీ నుంచి రఘునందన్రావు ప్రచారం చేపడుతూ ఓటర్ మహాశయులను  ఆకట్టుకునే పనిలో పడ్డారు. మరోవైపు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఎక్కువగానే ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.



 ఇక దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే మీడియా సమావేశం నిర్వహించిన తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బండి సంజయ్ పై విమర్శలు చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బిజెపి అవాస్తవాలు ప్రచారం చేస్తూ  ప్రజలను మోసం చేస్తుంది అంటూ మండిపడ్డారు. బీడీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చే 2000 రూపాయల పింఛను లో 1600 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అంటూ అవాస్తవాలను బండి సంజయ్ ప్రచారం చేస్తున్నారని ఒకవేళ 1600 కేంద్రం ఇస్తున్నట్లు నిరూపించకపోతే రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలంటూ సవాల్ చేశారు హరీష్ రావు.

మరింత సమాచారం తెలుసుకోండి: