కరోనా కారణంగా అన్ని రకాల ఉత్సవాలు రద్దయ్యాయ్. లక్షల్లో జనం హాజరయ్యే బన్నీ వేడుకలు కూడా రద్దు చేశారు అధికారులు. అయితే అలా కుదరదంటున్నారు స్థానికులు.

దేవరగట్టు బన్ని ఉత్సవాలపై నాలుగేళ్ల క్రితం మానవ హక్కుల కమిషన్ స్పందించింది. దీనిపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. ఆ తరువాత కాస్త గట్టిగానే చర్యలు తీసుకున్నారు. మళ్లీ షరా మామూలే అయ్యింది. గత ఏడాది పోలీసులను బన్ని ఉత్సవంలోనే తరిమి కొట్టారు స్థానికులు. కొందరు పోలీసులు ఏకంగా కొండల్లోకి పారిపోయారు. ఖాకీ దుస్తులు విప్పేసి అక్కడే ఉన్న వారి వద్ద లుంగీలు, టవళ్లు తీసుకొన్నారు. మళ్లీ బందోబస్తు వద్దకు వచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు. దేవరగట్టు హింసను శాశ్వతంగా నివారించేందుకు చర్యలు మాత్రం తీసుకోలేదు. కేవలం బందోబస్తు ఏర్పాటు చేయడమే పోలీసు శాఖ బాధ్యత అన్నట్లుగా ఉంటుంది. గతంలో హింసను నివారించేందుకు ఓ పోలీస్ ఉన్నతాధికారి ప్రయత్నించారు. అంతేస్థాయిలో స్థానికులు తిరగబడ్డారు. పోలీసులపైనే దాడి చేశారు.

అయితే.. ఇన్నాళ్లు దేవరగట్టులో మలమల్లేశ్వర స్వామి ఉత్సవాలు ఒక ఎత్తు అయితే కరోనా సమయంలో నిర్వహిస్తున్న ఉత్సవాలు మరో ఎత్తు. కొవిడ్ కారణంగా జనం పెద్ద ఎత్తున పాల్గొనే కార్యక్రమాలను ప్రభుత్వం రద్దు చేసింది. అందులో భాగంగానే కర్రల సమరం కూడా రద్దు చేశామంటున్నారు పోలీసులు. పూజలు మాత్రమే చేసుకోవాలని , 50 మందికి మించి పాల్గొనరాదని ఆంక్షలు విధించారు. ఆమేరకు పోస్టర్ విడుదల చేశారు. ప్రజలు ఎక్కువగా బయటకు రాకూడదని ఇప్పటికే ఆంక్షలు విధించారు. బన్నీ ఉత్సవానికి  భారీగా జనం హాజరైతే కరోనా విస్తరిస్తుందని హెచ్చరిస్తున్నారు అధికారులు. బన్నీ ఉత్సవం రద్దు కఠినంగా అమలు చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఆలూరు నియోజకవర్గంలో ఈ రోజు..రేపు లాక్‌డౌన్ తో పాటు 144సెక్షన్ అమలు చేస్తున్నారు. సాధారణంగా కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున జనం హాజరవుతారు. అక్కడి నుంచి జనం రాకుండా పోలీసులు వాహనాలను నిలిపివేస్తున్నారు.  

మరోవైపు..దేవరగట్టు కర్రల సమరం ఆపేది లేదంటున్నారు స్థానికులు. శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని అడ్డుకోవద్దని అధికారులను కోరుతున్నారు. కొవిడ్ కారణంగా జాగ్రత్తగా ఉత్సవాలు నిర్వహిస్తామని చెబుతున్నారు. అలాగని ఉత్సవాలు వద్దంటే సహించేదిలేదంటూ హెచ్చరిస్తున్నారు. ఉత్సవాలకు రాకుండా పరిసర గ్రామాల ప్రజలను అడ్డుకోవడం కష్టమేనంటున్నారు స్థానికులు.


మరింత సమాచారం తెలుసుకోండి: