ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుచరుడిగా పేరుబడిన రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైన అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రానికి మన రాష్ట్రం లోకువైపోయిందని, ఈ పరిస్థితి చూస్తే చాలా బాధ కలుగుతోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే అడగని ప్రభుత్వం ఎందుకు? ఏపీ విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారని గుర్తుచేశారు. ప్రస్తుతం రూ.20వేల కోట్ల కంటే ఎక్కువ ఇవ్వబోమని... భూసేకరణ, పునరావాసంతో తమకు సంబంధం లేదని కేంద్రం రాష్ట్రానికి లేఖ రాయడం అవమానకరమన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ప్రశ్నించలేకపోతోందని, ప్రజలు అనుకుంటున్నట్టు మీరు సీబీఐ కేసులకు భయపడుతున్నారా? అని ఉండవల్లి నిలదీశారు.


పోలవరం ప్రాజెక్టు గురించి వివరాలివ్వడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ పలు సందర్భాల్లో అన్నారని, నేను అనేకసార్లు అడిగానని, సమాచార హక్కు చట్టం ద్వారా ప్రశ్నించినా చెప్పలేదని వ్యాఖ్యానించారు. 2017 కేబినెట్‌ నోట్‌లో ఏముందో బయటపెట్టాలని జలవనరుల శాఖ ప్రస్తుత మంత్రి, మాజీ మంత్రి డిమాండ్‌ సవాళ్లు చేసుకుంటున్నారని, ఆ నోట్‌ తన వద్ద ఉందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును రాష్ట్రానికి అప్పగించిన కేంద్రం.. 2014 ధరల ప్రకారం చేయాలని మాత్రమే చెప్పిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.20వేల కోట్లే ఇస్తామని... ఇక ఇవ్వాల్సింది రూ.7వేల కోట్లే అని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఏపీకి లేఖ రాసిందని ఉండవల్లి గుర్తుచేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి అవమానకరమని, ప్రాజెక్టు ఎత్తు ఎంతనేది ముఖ్యం కాదని... రిజర్వాయర్‌లో నీరెంత ఉండాలనేదే ముఖ్యమని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 45 మీటర్ల వరకు కట్టి... గ్రావిటీ ద్వారా నీరిస్తే ఎవరు ప్రశ్నిస్తారని ఉండవల్లి అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఆసియాలోనే ప్రాధాన్యం ఉంది. గోదావరికి మూడుసార్లు వరద వస్తుంది. శబరి, సీలేరు నదుల వల్ల కూడా ఇక్కడ వరద వస్తుంది. నాడు వెంకయ్యనాయుడు వీరోచితంగా పోరాడి రాష్ట్రానికి సాధించిన ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగడం లేదని ఉండవల్లి నిలదీశారు. కేంద్రం ఏపీ అనే బాడీని తీసేసింది... ఇక పోలవరాన్ని రాజ్యాంగ సమస్యగా మార్చండి.. చిన్న కేసులకే కోట్లు ఇచ్చి పెద్ద లాయర్లను నియమిస్తున్నారు. అదంతా వృథా. పోలవరంపై పెద్ద పెద్ద లాయర్లను పెట్టి వాదనలు వినిపించండి అని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: